ఏదేమైనా.. 2024లో జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సొంతంగా మరోసారి అధికారాన్ని అందుకునే స్థాయిలో సీట్లను గెలుస్తుందంటూ పందెం కడుతున్నాయి మీడియా సంస్థలు. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా.. మోడీకి తిరుగేలేదంటూ వంతపాటలందుకున్నాయి జాతీయ స్థాయి మీడియా సంస్థలు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 300లకు పైగా ఎంపీ సీట్లను నెగ్గేస్తుందంటూ ఈ సంస్థలు రాజకీయ జాతకాలు చెబుతున్నాయి. మరి ఇంత పెద్ద దేశంలో ఇంత తేలికగా చెప్పేయడం సులువా? అంటే.. మూడ్ ఆఫ్ ద నేషన్ అంటున్నాయి మీడియా సంస్థలు. వంద కోట్ల మంది ఓటర్లే ఉన్న దేశంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేస్తాయో మూడు నెలలకు ఒక్కసారి చెప్పగలవు మన మీడియా సంస్థలు. అది వాటి ఊహాశక్తికి నిదర్శనం.
అయితే.. మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలు, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్.. ఇవన్నీ కూడా నూటికి యాభై శాతం కూడా వాస్తవిక ఫలితాలతో సంబంధం లేని రీతిలోనే ఉంటాయి. గుడ్డిగా గూట్లోకి రాయి వేసినట్టుగా రకరకాల సంస్థలు వివిధ అధ్యయన ఫలితాలను ఇస్తున్నాయి.
మరి 2019 ఎన్నికల్లోనే బీజేపీకి సొంతంగా మెజారిటీ రావడం వెనుక, మూడు వందల లోక్ సభ సీట్లు ఎన్డీయే కూటమికి దక్కడం వెనుక ఎన్నో సమీకరణాలు, అప్పటి రాజకీయ వేడి వంటి కారణాలు ఉన్నాయనేది అప్పుడే అంతా కన్వీన్సింగ్ గా మరిచిపోయారు. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు కశ్మీర్ లో తలెత్తిన పరిస్థితులు అప్పుడు బర్నింగ్ టాపిక్ అయ్యాయి. సైనికులు ప్రయాణిస్తున్న బస్సు పేలిపోవడంతో.. భావోద్వేగపూరిత వాతావరణాన్ని ఏర్పరిచింది. అది ఉగ్రదాడి అనే ప్రకటన దేశంలో సంచలనం రేపింది. ఆ తర్వాత ప్రతీకార చర్యలకు భారత్ పూనుకోవడం.. సర్జికల్ స్ట్రైక్స్ అనే మాట ఉర్రూతలూగించింది.
సర్జికల్ స్ట్రైక్స్ తో భారత్ పాక్ పీఛమణించిందని, ఉగ్రతాండాలపై భారతదళాలు విరుచుకుపడ్డాయనే వార్త దేశ జనులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అది తమ ఘనత అని బీజేపీ గట్టిగా ప్రచారం చేసుకుంది. పాక్ కు గట్టి జవాబు చెప్పినట్టుగా బీజేపీ తనే యుద్ధం చేసినంత స్థాయిలో హడావుడి చేసింది. అభినందన్ వర్థమన్ వ్యవవహారం కూడా అప్పట్లో మోడీ గ్రాఫ్ ను అమాంతం పెంచేసింది! ఇలా బీజేపీకి భారీ మెజారిటీ రావడం వెనుక ఆ భావోద్వేగ పూరిత వాతావరణం ప్రమేయం ఎంతో ఉంది.
ఇక వరసగా రెండో సారి అధికారం దక్కాకా.. మోడీ నాయకత్వం అనేక సంస్థలను అమ్మకానికి పెట్టడం మీదే పని చేస్తున్నట్టుగా ఉంది. ఎల్ఐసీ, రైల్వేల ప్రైవేటీకరణ, నవరత్న కంపెనీల అమ్మకం.. వంటి వ్యవహారాలు మోడీ పై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి తప్ప ఇవన్నీ మోడీ గ్రాఫ్ ను పెంచే అంశాలైతే కాదు. ఇక నిత్యవసరాల ధరలు, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం కట్టడిలో వైఫల్యం .. ఇవి కూడా మోడీ ప్రోగ్రెస్ కార్డులోని ప్రధానాంశాలు. సరిహద్దుల్లో చైనా డ్యాన్సులు వేస్తోంది. ముందు ముందు దాని వేషాలు ఎలా ఉంటాయో.. ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ అంశం గురించి మోడీ కానీ, భక్తులు కానీ మాట్లాడరు!
పాలకుడిగా మోడీ వైఫల్యాలను మీడియాలో చర్చ జరగకుండా చూసుకోవడంలో బీజేపీ వర్గాలు విజయవంతం అవుతున్నాయి. ఇల్లు లేని భారతీయుడు కూడా జెండా పండగనాడు జెండా కట్టాలనే పిలుపు విజయవంతం అయ్యిందనే ఉత్సాహంతో ఉన్నారంతా. ఇదే మోడీ మానియాకు నిదర్శనం అనే పరిస్థితి కనిపిస్తోంది. వీరజాతీయ వాదంతో మరోసారి మోడీ గద్దెనెక్కవచ్చునేమో కానీ.. మరీ మూడు వందలకు పైగా సీట్లను ఇట్టే నెగ్గేయగల 2019 నాటి భావోద్వేగ పూరిత ఉద్రేకాలున్నాయా? మీడియా నాడికి ఇవి అందుతున్నాయా?