cloudfront

Advertisement

Advertisement


Home > Politics - National

నీచరాజకీయ ఎత్తుగడల్లో ఇది మరో ఎపిసోడ్!

నీచరాజకీయ ఎత్తుగడల్లో ఇది మరో ఎపిసోడ్!

బీజేపీ చేసే నీచరాజకీయ ఎత్తుగడల్లో మహారాష్ట్ర ఎపిసోడ్ ప్రత్యేకంగా మిగిలిపోతుంది. తమను కాదని.. తమ ప్రత్యర్థులతో జట్టుకట్టిన ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి కమలదళం ఎన్నాళ్లనుంచి ప్రయత్నాల్లో ఉండిపోయినదో గానీ.. ఎట్టకేలకు మహాకరాష్ట్రలోని మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం నేడో రేపో కూలిపోనుంది. ఆశావహులు ఇంకా.. మహారాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగించడానికి అవకాశం ఉందనే మాటలు వల్లిస్తున్నారు గానీ.. తిరుగుబాటు చేసిన ఏక్‌నాధ్ శిండే మాటలు, ఆ మాటల్లోని తీవ్రతను గమనిస్తే అది అంత సులువు కాదని అర్థమవుతోంది. 

ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని ప్రభుత్వానికి ఇక కాలం చెల్లినట్టే. తనకు 34 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని చెప్పుకుంటున్న ఆ పార్టీ నాయకుడు, మంత్రి ఏక్‌నాధ్ శిండే ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో శిబిరం నడుపుతున్నారు. ఆయనతో చర్చలు నడుస్తున్నాయని.. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వంటివారు చెబుతున్నారు గానీ.. ఆ వాతావరణం గానీ, ఒకవేళ అలాంటి ప్రయత్నాలు ఫలిస్తున్న సూచన గానీ కనిపించడం లేదు. 

తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ నిన్నటిదాకా గుజరాత్ లో తలదాచుకున్నారు. అక్కడ శిబిరరాజకీయాలు నడిచాయి. మహారాష్ట్రలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు క్యాంపు నడుపుతున్న సూరత్ లోని హోటల్ కు గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం అతి పటిష్ఠమైన భద్రత కల్పించింది. వారంతా సూరత్ క్యాంపునుంచి తాజాగా గువాహటికి మారారు. మహారాష్ట్రకు వీలైనంత దూరంగా ఉండడం వలన ఎడ్వాంటేజీ ఉంటుందని అనుకున్నారో ఏమో తెలియదు. సహజంగానే అక్కడి బిజెపి ప్రభుత్వంకూడా భద్రత గట్టిగానే ఏర్పాటు చేసింది. 

పైగా అసోం ముఖ్యమంత్రి, బిజెపికి చెందిన హిమంత బిశ్వ శర్మ, మరోమంత్రి పీయూష్ హజారికా వారు బసచేసి ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ కు వెళ్లి మంతనాలు జరిపినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. 

ఉద్ధవ్ మీద నానా ఆరోపణలు చేసిన ఏక్‌నాధ్ శిండే మహావికాస్ అఘాడీ కూటమి ఏర్పాటునే తప్పుపడుతున్నారు. తన చీలిక వర్గమే అసలైన శివసేన అని ఆయన ప్రకటించుకున్నారు. తన చీలిక వర్గానికి ఒక విప్ ను కూడా నియమించుకున్నారు. 

మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే.. తాను ముఖ్యమంత్రి పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించినప్పటికీ.. సంక్షోభం తొలగేలా కనిపించడం లేదు. ఆయన రాజీనామా చేసేసినట్లు కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. అదే సమయంలో.. ఏక్‌నాధ్ శిండేనే సీఎం చేస్తే గొడవుండదని శరద్ పవార్ ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి గానీ.. అసలు కాంగ్రెసుతో కలవడాన్నే తప్పుపడుతున్న శిండే అందుకు తలొగ్గుతారో లేదో తెలియదు. పైగా ఆయనను సీఎం చేయడానికి.. ఎటూ బీజేపీ ఉవ్వళ్లూరుతూనే ఉంది. ఆయనకు ఆ పదవిని ఎరవేయడం ద్వారానే బిజెపి ఠాక్రే ప్రభుత్వ పతనానికి బాటలు తీర్చిందని అర్థమవుతోంది.

ప్రస్తుతానికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని కూడా విడిచి తన సొంత ఇంటికి వెళ్లిపోయారు. కొవిడ్ పాజిటివ్ కారణంగా ఆయన పార్టీ వారితో ఫోన్లో మాత్రమే మాట్లాడుతున్నారు. అదే సమయంలో గవర్నరు, 80 ఝళ్ల భగత్ సింగ్ కోశ్యారీ కూడా కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి.. మహారాష్ట్ర సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిజెపికి కోవిడ్ సహకరిస్తోంది. అధికారికంగా.. పరిపాలన చేతులు మారడానికి కొన్ని రోజులు పట్టినా ఆశ్చర్యం లేదు.

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి