కేంద్రంలో నరేంద్ర మోడీని ఓడించాలనే సంకల్పంతో ఉన్న అనేక పార్టీలు ఇంకా ఒక్క తాటి మీదకు రానేలేదు. వారి మధ్య బేరసారాలు కుదురుతాయో లేదో, అందరూ ఎవరికి వారు విడివిడిగా పోటీచేసి మళ్లీ మోడీ నెత్తిన పాలు పోస్తారో.. ఇంకా తేలనే లేదు. సంకీర్ణం పుట్టనే లేదు గాని, అందులో ముసలం మాత్రం అప్పుడే పుట్టింది.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని ఎవరు అనే దిశగా ఎవరికి వారు తమ తమ వ్యూహాలను బయటపెడుతున్నారు. పార్టీల మధ్య ఐక్యత ఎండమావి అవుతుందా అనే అనుమానం కలిగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క అత్యాశ మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏఐసీసీ సారధి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలో మాత్రమే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చాలా విశదంగా ప్రకటించారు. అసలు తమకు ఎన్ని రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ బలం ఉన్నదో ఈ జాతీయ పార్టీ సారధికి తెలుసో లేదో గాని ప్రభుత్వానికి సారథ్యం తమ చేతిలోకే రావాలని ఆశ మాత్రం దండిగా నే ఉంది. దేశవ్యాప్తంగా అనేక చిన్న పార్టీలను కలుపుకొని వారి భుజాల మీద సవారి చేస్తే తప్ప కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం కల్ల. అయినా సరే ఆయన ఆశ విషయంలో తగ్గడం లేదు.
ఖర్గే తమ అధిష్టానం సోనియా రాహుల్ లను ప్రసన్నం చేసుకోవడానికి.. ఈ మాటలు చెప్పి ఉండవచ్చు గాక! కానీ పార్టీ నాయకులు అందరూ దానిని అందిపుచ్చుకున్నారు. రాహుల్ భజనలో ఖర్గే ఒక అడుగు వేస్తే, రాహులే ప్రధాని కావాలని అంటూ తాము పది అడుగులు వేయడానికి పలువురు సిద్ధపడుతున్నారు.
అయితే అదే స్థాయిలో సంకీర్ణంలో ముసలం పుడుతుంది. కాంగ్రెస్ తో కలిసి మాత్రమే మోడీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలనే అభిప్రాయం చాలామందిలో ఉన్నది గాని.. ఆ కూటమికి కాంగ్రెస్ సారధ్యం వహించాలి అని వారు అనుకోవడం లేదు. ప్రధాని పదవిని రాహుల్ చేతుల్లో పెట్టి తాము చూస్తూ కూర్చోవాలనే కోరిక కూడా వారికి లేదు. . వారందరూ నెమ్మది నెమ్మదిగా తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తూ ఉన్నారు.
ఖర్గే రాహుల్ భజన చేసినంత స్పష్టంగా కాకపోయినప్పటికీ, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణం అసలు ఏర్పడకుండానే దేశానికి తదుపరి ప్రధాని ఎవరు అనే విషయంలో విపక్షాలు గొడవ పడడం మంచిది కాదని ఆయన హితవు చెబుతున్నారు. ఎవరిని అడ్డుకోవడం కోసం తాము ఏకం కావాలని కోరుకుంటున్నాము అదే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు.
భారతీయ జనతా పార్టీని వీడిన తర్వాత మమతా దీదీ చలవతో ఎంపీ అయిన శత్రుఘ్న సిన్హా.. రుణం తీర్చుకునేందుకు అలా మాట్లాడటం వింతేమీ కాదు. ప్రధాని పదవి మీద మమతా బెనర్జీకి ఆశ ఉన్నదని అందరికీ తెలుసు. కాంగ్రెస్ వారి మాటలు విని.. ప్రధాని పదవిని ఆశించే ఎందరు నాయకులు ఇంకా ముందుకు వస్తారో చూడాలి. ఈ పదవీ వ్యామోహ ముసలం అసలు సంకీర్ణాన్ని పుట్టకుండానే చంపేస్తుందేమో కూడా చూడాలి.