టీడీపీ కొత్త పెళ్లి కొడుకు కన్నా లక్ష్మీనారాయణను పార్టీలో చేరిన మొదటి రోజే ఆ పార్టీ అనుకూల చానల్ డిన్నర్‌కు పిలిచింది. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అయితే పార్టీలో చేరిన ఫస్ట్ డేనే టీడీపీకి షాక్ ఇచ్చేలా కన్నా మనసులో మాటను బయట పెట్టారు. టీడీపీ బలహీనతల్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. జనసేనతో పొత్తు లేకపోతే అధికారంలోకి వచ్చే సీన్ లేదని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
ఎల్లో చానల్ డిబేట్లో కన్నా ఏమన్నారంటే… జనసేన, తమ పార్టీ మధ్య పొత్తు వుండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పొత్తు వుంటే రాక్షస పాలన నుంచి విముక్తి పొందొచ్చని ప్రజలు ఆశిస్తున్నారని ఆయన అమాయకంగా చెప్పినా నిజమే చెప్పారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అందరూ కలిసి రావాలని పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపును కన్నా గుర్తు చేయడం విశేషం.
కన్నా తాజా వ్యాఖ్యలు టీడీపీకి డ్యామేజ్ కలిగిస్తున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎందుకంటే జనసేనతో పొత్తు లేకపోతే వైఎస్ జగన్‌ను అధికారం నుంచి గద్దె దించడం సాధ్యం కాదని కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగా చెప్పినట్టైంది. టీడీపీ ఒంటరిగా అధికారంలోకి రాదని కన్నా మాటలు చెబుతున్నాయనే చర్చకు తెరలేచింది.
ఒకవైపు రాక్షస పాలన అని, ప్రజలు ఏదో కోరుకుంటున్నారని కన్నా చెబుతున్నప్పటికీ, జనసేన తమతో కలిసి వస్తేనే, టీడీపీకి భవిష్యత్ అని ఆయన మాటలు నెగెటివ్ సంకేతాలు తీసుకెళ్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్‌పై కులపరంగా ప్రేమో లేక కాపుల ఓట్ల కోసం కన్నా నాటకమో తెలియదు కానీ, జనసేన గురించి ఎక్కువ చెప్పడం ద్వారా, టీడీపీని తగ్గించినట్టవుతోందనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకుంది. తాను కాపు నాయకుడై ఉండి, పవన్ కల్యాణ్ మద్దతు కోసం ఎదురు చూడడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.