దర్శకుడు ఆర్జీవీ ఇప్పుడు ఆల్ మోస్ట్ ఖాళీ. సినిమాలు చేతిలో వున్నాయని వార్తలు అయితే వున్నాయి కానీ చేస్తున్న దాఖలాలు అయితే లేవు. రోజు ఏదో ఒక పొలిటికల్ ట్వీట్ పెడతారు. పెద్దగా ఎవరూ పట్టించుకోరు. పైగా ఎప్పుడూ లోకేష్ మీదే పడుతూ వుంటారు కనుక అస్సలు పట్టించుకోరు.
ఇప్పుడు ఆయన తన చూపు హైదరాబాద్ నగర మేయర్ వైపు తిప్పారు. అమ్మకు చిక్కిన మేక అన్నట్లు ఆమెను పట్టుకున్నారు. హైదరాబాద్ లో కుక్కలు ఓ బాలుడి మీద దాడి చేసి చంపేసిన దుర్ఘటన నేపథ్యంలో ఆర్జీవీ ఆమెతో ట్విట్టర్ లో ఆడుకోవడం మొదలుపెట్టారు. కుక్కలు అంటే మేయర్ కు ఇష్టం వున్నట్లు తెలిపే ఓ పాత వీడియోను బయటకు తీసారు. మేయర్ ఇంట్లోకి అయిదువేల కుక్కల్ని వదలాలి అంటూ కామెంట్ చేసారు. తనతో ఏ చానెల్ లో అయినా డిస్కషన్ కు రావాలంటూ సవాలు చేస్తున్నారు.
జరిగింది దుర్ఘటనే. అందులో సందేహం లేదు. వీధి కుక్కలను నిర్మూలించాలి. అందులొనూ డౌట్ లేదు. కానీ కేవలం మేయర్ ను మాత్రమే టార్గెట్ చేసుకోవడం చిత్రంగా వుంది. మున్సిపల్ కమిషనర్ వున్నారు. సిబ్బంది వున్నారు. వారిని పల్లెత్తు మాట అనడం లేదు. ఇలాంటి సంఘటన ఆంధ్రలో జరిగితే ప్రతిపక్షం నేరుగా సిఎమ్ జగన్ మీదే పడి వుండేది. తప్పంతా జగన్ దే అయినట్లు మాట్లాడేది.
ఆర్జీవీ అసలు ప్రభుత్వం జోలికి పోవడం లేదు. కేవలం మేయర్ ను పట్టుకుని ట్వీట్ ల మీద ట్వీట్ లు వేస్తూ తెగ ర్యాగింగ్ చేస్తున్నారు. నిజానికి ఏ వార్డులో ఈ సంఘటన జరిగిందో ఆ వార్డు సిబ్బందిని నిలదీయాలి. ఏరియా అధికారులు, నగర అధికారులు వున్నారు. వారిని కూడా బాధ్యులను చేయాలి. మేయర్ ను నిలదీయడంతో పాటు, ఇంకా ధైర్యం వుంటే మున్సిపల్ వ్యవహారాలు చూసే మంత్రినీ ప్రశ్నించాలి. అంతే తప్ప కేవలం ఒక్కరినే టార్గెట్ చేయడం సరైరది కాదేమో?
అయినా ఆర్జీవీ ట్వీట్ లు మీడియాలో వార్తలు రాసుకోవడానికి తప్ప మరెందుకు పనికి రాకుండా పోయాయి. జనం ఏనాడో పట్టించుకోవడం మానేసారు. తన అస్థిత్వం కోసం తను పాకులాడుతున్నాడు. ఇది కూడా ఏన్నాళ్లో సాగకపోవచ్చు.