అమెరికా చ‌రిత్ర‌లో ట్రంప్ .. అలాంటి రెండో అధ్య‌క్షుడు!

ప్ర‌పంచంలోనే అతి పురాత‌న ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఒక‌టైన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల విష‌యంలో చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన నియ‌మాలున్నాయి. అదెవ‌రైనా స‌రే, రెండు ప‌ర్యాయాలు మాత్ర‌మే అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం ఉండ‌టం అందులో ముఖ్య‌మైన‌ది. చ‌రిత్ర‌లో…

ప్ర‌పంచంలోనే అతి పురాత‌న ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఒక‌టైన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల విష‌యంలో చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన నియ‌మాలున్నాయి. అదెవ‌రైనా స‌రే, రెండు ప‌ర్యాయాలు మాత్ర‌మే అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం ఉండ‌టం అందులో ముఖ్య‌మైన‌ది. చ‌రిత్ర‌లో ఒకే ఒక అధ్య‌క్షుడు మూడు ప‌ర్యాయాలు ప‌ద‌విని చేప‌ట్టాడు, అది కూడా అప్ప‌టి కార‌ణాల వ‌ల్ల‌. అలాగే ఎవ‌రు పోటీ చేసినా రెండు ప‌ర్యాయాలు వ‌ర‌స‌గా పోటీ చేసేయ‌డం, ఆ త‌ర్వాత క్రియాశీల రాజ‌కీయాల నుంచి దాదాపుగా దూరం కావ‌డం జ‌రుగుతూ ఉంటుంది.

బిల్ క్లింట‌న్, జార్జ్ డ‌బ్ల్యూ బుష్, ఒబామా.. ఈ వ‌ర‌స‌లోని వారే! వీరు ముగ్గురూ ఒక్కొక్క‌రు వ‌ర‌స‌గా ఎనిమిదేళ్ల పాటు అంటే రెండు ప‌ర్యాయాల పాటు అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి త‌ప్పుకున్నారు. గ‌త నల‌భై యేళ్ల కాలంలో తొలి ప‌ర్యాయం త‌ర్వాత వ‌ర‌స‌గా రెండో ప‌ర్యాయం అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌ని వారు త‌క్కువ మందే. జిమ్మీ కార్ట‌ర్, జార్జ్ బుష్, డొనాల్డ్ ట్రంప్ ఒక్కో ప‌ర్యాయం త‌ర్వాత వైట్ హౌస్ కు దూరం అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో బైడెన్ చేరిన‌ట్టుగా అవుతుంది. అయితే గోడ‌కు కొట్టిన బంతి వ‌లే ట్రంప్ ఇప్పుడు తిరిగి ప‌వ‌ర్ సంపాదించుకున్నాడు!

ఒక ప‌ర్యాయం బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాకా, పోటీ చేసే అవ‌కాశం రాక‌పోయినా, పోటీ చేసి ఓడిపోయినా.. అది అవ‌మాన‌క‌రంగా భావించి చాలా మంది ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరం అవుతూ ఉంటారు. దీంతో అమెరికా చ‌రిత్ర‌లో ఒక‌సారి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాకా ఓడిపోతే మ‌ళ్లీ అధ్య‌క్షుడు కావాల‌నే ప్ర‌య‌త్నాల‌ను చేసిన వారు క‌న‌ప‌డ‌రు. ట్రంప్ అందుకు మిన‌హాయింపు. త‌న నాలుగేళ్ల పాల‌న త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయినా, ఆ త‌ర్వాతి నాలుగేళ్ల‌కు మ‌ళ్లీ పార్టీ త‌ర‌ఫున అవ‌కాశం సంపాదించ‌డంతో పాటు, ఎన్నిక‌ల్లో కూడా నెగ్గి ప‌ద‌విని చేప‌డుతున్నాడు!

ఇలాంటి అరుదైన పొలిటిక‌ల్ ఫీట్ సాధించాడు ట్రంప్. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ త‌ర‌హాలో అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన వారిలో ట్రంప్ కేవ‌లం రెండో వాడు. ఎప్పుడో 1884 ఎన్నిక‌ల్లో అమెరికా 24 అధ్య‌క్షుడుగా ఎన్నికైన గ్రోవ‌ర్ క్లేవ్ ల్యాండ్ త‌న నాలుగేళ్ల పాల‌న త‌ర్వాత వైదొలిగాడు. అయితే ఆ త‌ర్వాతి నాలుగేళ్ల‌కు మ‌ళ్లీ అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి గెలిచాడాయ‌న‌. త‌ద్వారా 1892లో తిరిగి 26 వ అధ్య‌క్షుడిగా ప‌ద‌విని పొందాడు! అలా ఒక ప‌ర్యాయం మిన‌హాయింపుతో రెండో సారి అధ్య‌క్ష ప‌ద‌విని పొందుతున్న అరుదైన జాబితాలో ట్రంప్ నిలుస్తున్నాడు!

2 Replies to “అమెరికా చ‌రిత్ర‌లో ట్రంప్ .. అలాంటి రెండో అధ్య‌క్షుడు!”

Comments are closed.