శివ‌సేన ఎవ‌రి సొంతం కానుంది?

శివ‌సేన అధికార చిహ్నం, ఆ పార్టీ పేరు .. అధికారికంగా ఏ వ‌ర్గం వాడుకోవాల‌నే అంశంపై తేల్చ‌డానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మాయ‌త్తం అవుతోంది. ఇటీవ‌ల శివ‌సేన‌లో వ‌చ్చిన చీలిక ఫ‌లితంగా ఆ పార్టీ…

శివ‌సేన అధికార చిహ్నం, ఆ పార్టీ పేరు .. అధికారికంగా ఏ వ‌ర్గం వాడుకోవాల‌నే అంశంపై తేల్చ‌డానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మాయ‌త్తం అవుతోంది. ఇటీవ‌ల శివ‌సేన‌లో వ‌చ్చిన చీలిక ఫ‌లితంగా ఆ పార్టీ అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రే మ‌హారాష్ట్ర సీఎం ప‌ద‌విని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఏక్ నాథ్ షిండే నాయ‌క‌త్వంలో బీజేపీ స‌పోర్ట్ తో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఈ ప్ర‌భుత్వంవైపే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నార‌ని స్ప‌ష్టం అయ్యింది. మ‌రోవైపు శివ‌సేన ఎంపీల‌ను కూడా ఏక్ నాథ్ షిండే గ్రూపు భారీగా చీల్చుకుంది. దాదాపు 16 మంది ఎంపీలు షిండే నాయ‌క‌త్వానికి జై కొడుతున్నార‌ట‌!

ఇలా ఏకులా మొద‌లైన షిండే తిరుగుబాటు మేకులా త‌యారైన‌ట్టుగా ఉంది. ఇక ఉద్ధ‌వ్ ఠాక్రే కు అన్ని ర‌కాల ప‌వ‌ర్స్ ను క‌ట్ చేయ‌డంపై కూడా షిండే గ్రూపు గ‌ట్టిగా దృష్టి సారించింది. బీజేపీ స‌పోర్ట్ ఎలాగూ ఈ గ్రూప్ కే ఉంది. దీంతో అటు లోక్ స‌భ‌లో త‌మ‌దే అస‌లైన శివ‌సేన గా గుర్తించాల‌నే లెట‌ర్ ఇచ్చారు. మ‌రోవైపు ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద కూడా షిండే గ్రూపు అలికిడి చేస్తోంది. త‌మ‌దే అస‌లైన సేన అంటూ పార్టీ పేరు, గుర్తు, ఆస్తులు.. అన్నింటిపై త‌మ‌దే అధికారం అంటూ వారు సీఈసీ వ‌ద్ద పిటిష‌న్ పెట్టారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం విచార‌ణ మొద‌లుపెట్టింది. వ‌చ్చే నెల ఎనిమిది వ‌ర‌కూ టైమ్ ఇచ్చి.. పార్టీ త‌మ‌దే అన‌డానికి ఎవ‌రి ఆధారాలు వారు స‌మ‌ర్పించాలంటూ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇరు వ‌ర్గాల‌కూ చెప్పింది!

షిండే గ్రూపు దూకుడు, వారికి బీజేపీ స‌పోర్ట్ ప్ర‌కారం చూస్తే… ఉద్ధ‌వ్ ఠాక్రే ఎంత మొత్తుకున్నా.. శివ‌సేన పేరును కూడా నిల‌బెట్టుకోలేడ‌ని స్ప‌ష్టం అవుతోంది. బీజేపీకి త్రాసులో ఎటువైపు కూర్చుంటే అటు వైపు అన్నీ మొగ్గే అవ‌కాశాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఠాక్రే అనుచ‌ర‌వ‌ర్గం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది. శివ‌సేన‌ను చంపేయాల‌ని ఢిల్లీ భావిస్తోందంటూ వారు విరుచుకుప‌డుతున్నారు. అయితే వారి అర‌ణ్య‌రోద‌నే కావొచ్చు.

ఇటీవ‌లి కాలంలో ఇలానే ఒక ప్రాంతీయ పార్టీ ప‌గ్గాలు పూర్తిగా మారాయి. బిహార్ లో ఎల్జేపీ తిరుగుబాటు వ‌ర్గానికి బీజేపీ పూర్తి అండ‌గా నిలిచింది. రామ్ విలాస్ పాశ్వాన్ త‌న‌యుడు చిరాగ్ పాశ్వాన్ నుంచి పార్టీని, పార్టీ గుర్తును, ఆస్తుల‌ను తిరుగుబాటు వ‌ర్గం సొంతం చేసుకుంది. ఆ తిరుగుబాటు ప‌ట్ల బీజేపీ ఎలాంటి వారింపులూ చేయ‌లేదు. తిరుగుబాటు వ‌ర్గాన్ని బీజేపీనే ముందుగా గుర్తించి కేంద్రంలో మంత్రి ప‌ద‌వులు ఇచ్చింది. అలా ఒక మిత్ర‌ప‌క్షం ఉనికే మార్చేసిన బీజేపీకి ఇప్పుడు ఉన్న ప‌వర్ తో శివ‌సేన‌ను కంగాళీ గా మార్చేయ‌డం పెద్ద క‌ష్టం కాక‌పోవ‌చ్చు!