స్వతంత్రం వచ్చే నాటికి దేశ జనాభా 33 కోట్లు అని లెక్కలు చెబుతున్నాయి. 75 యేళ్ల తర్వాత ప్రస్తుతంలో దేశ జనాభా సుమారు వంద కోట్లు అదనంగా పెరిగింది. ప్రస్తుత దేశ జనాభా 141 కోట్ల వరకూ ఉంటుందని అంచనా! మరి డెబ్బై ఐదేళ్లలో ఈ మేరకు దేశ జనాభా పెరిగినప్పటికీ.. వచ్చే డెబ్బై ఐదేళ్లలో మాత్రం మాత్రం..దేశ జనాభాలో భారీ తగ్గుదల నమోదు అవుతుందని అంటున్నాయి అంతర్జాతీయ అంచనాలు.
ప్రపంచవ్యాప్తంగా జనాభా హెచ్చుతగ్గులపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన అంచనాల ప్రకారం.. వచ్చే డెబ్బై ఐదేళ్లలో భారతదేశ జనాభా పెరగడం కాదు, భారీగా తగ్గుతుందట!
2100 నాటికి ఇండియా జనాభా తిరిగి వందల కోట్ల స్థాయికి పడిపోతుందని ఐరాస అంచనా వేసింది. ప్రస్తుతం దేశ జనాభా 141 కోట్లు అనుకుంటే, 2100 నాటికి ఇదే దేశం పరిధిలో వంద కోట్ల మంది మాత్రమే ఉంటారట! ఇలా 41 కోట్ల మేర జనాభా తగ్గుతుందని ఈ అంచనా చెబుతోంది!
ఇండియాలో మారుతున్న సామాజిక, ఆరోగ్య పరిస్థితులే జనాభా తగ్గుదలకు కారణం అవుతాయని కూడా ఐరాస విశ్లేషించింది. సామాజిక పరిస్థితుల దృష్ట్యా కూడా ఫెర్టిలిటీ రేటు తగ్గుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
కొత్తతరం ఆసక్తులు జనాభా పెంపు దిశగా లేవని అనుకోవాలి. ఇప్పటికే పాతికేళ్ల వయసు వచ్చిన వారికి కూడా పెళ్లి చేసుకుని, పిల్లలను కనేయాలనే ఆసక్తి అమితంగా అయితే లేదు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయిల్లో కూడా పెళ్లి, పిల్లలు మరీ తీవ్రమైన పట్టింపు ఉన్న అంశాలు కావు. ఇంకోవైపు పెళ్లి చేసుకున్న వారిలో కూడా పిల్లలు అంటే.. ఒక్కరిని కనిపెంచడానికే అలసిపోతున్నారు. ఆర్థికం గా ఉన్న వారిలో కూడా ఒక్కరిని కని పెంచడమే చాలనే భావన ఉంది.
యాభై యేళ్ల కిందటి వరకూ ఒక్కో జంట ఐదారు మంది పిల్లలను కనడం సంప్రదాయంగా ఉన్న దేశం మనది. ఫలితంగా జనాభా పెరుగుదల రేటు భారీగా నమోదు అవుతూ వచ్చింది. ఇప్పుడు రోజులు మారాయి. 20 యేళ్ల కిందట ఇద్దరు పిల్లలకు పరిమితం కావడం, వీలైతే ఒక్కరే చాలనుకునే పరిస్థితి అమలు చేసుకున్నారు జనాలు. ఇప్పుడు పెళ్లే వద్దు అనుకునే తరం, పెళ్లి కాగానే పిల్లలు వద్దనుకునే ప్లాన్లు చేసుకోవడం సహజంగా మారింది. కన్నా ఒక్కరే చాలు అనే వాళ్లూ చాలా మంది కనిపిస్తున్నారు.
ఈ ఫలితంగా రానున్న డెబ్బై ఐదేళ్లలో భారత దేశ జనాభా భారీ స్థాయిలో తగ్గుతుందనేది ఐక్యరాజ్యస సమితి అంచనా.