ఒకవైపు భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న పెద్ద లక్ష్యం.. దేశంలో వారసత్వ పార్టీలను అణిచి వేయడమేనట! వారసత్వమే పరమావధిగా వ్యవహరించే ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నింటినీ బీజేపీ తన బుల్డోజర్ కింద నలిపేస్తుందట.
ఆఖరికి కాషాయ చొక్కాలనే వేసుకునే శివసేనను కూడా బీజేపీ సహించనది వారసత్వం విషయంలోనేనట! వారసత్వ రాజకీయాలు దేశానికి పట్టిన చీడ అని.. ఈ చీడను నలిపేయడమే బీజేపీ పెట్టుకున్న లక్ష్యమని.. ఇందులో భాగంగా టీఆర్ఎస్ వంటి పార్టీని కూడా బీజేపీ నలిపేస్తుందని బీజేపీ వాదులు, వాట్సాప్ యూనివర్సిటీ పట్టభద్రులు ప్రచారం చేస్తూ ఉంటారు!
అయితే మిగతా పార్టీల్లో వారసుల గురించి తెగ బాధపడిపోయే కాషాయవాదులకు బీజేపీ పరిణామాలు మాత్రం గుర్తుకురావు అంత తేలికగా! ఉద్ధవ్ ఠాక్రే తన తనయుడికి మంత్రి పదవిని ఇవ్వడంపై గగ్గోలు పెట్టే కమలనాథులు.. అదే మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే తనయుడికి రేపోమాపో మంత్రి పదవిని ఇస్తారు! ఉద్ధవ్ ఠాక్రే ది వారసత్వ రాజకీయం. అదే ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని.. రాజ్ ఠాక్రే తనయుడిని మంత్రిని చేస్తే మాత్రం అది దేశం కోసం, ధర్మం కోసమంతే!
ఇక ఇదే సమయంలో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప తన రాజకీయ విశ్రాంత ప్రకటన చేశారు. తను ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనంటూ ఈ కురువృద్ధ నేత ప్రకటించుకున్నారు. అదే సమయంలో ఆయన తన వారసత్వ పట్టాభిషేక ప్రకటనను కూడా చేశారు. తన తనయుడు విజయేంద్ర తన రాజకీయ వారసుడని.. ఆయన కర్ణాటకలోని ఎక్కడ నుంచి అయినా పోటీ చేస్తాడంటూ యడియూరప్ప తేల్చి చెప్పాడు.
ఇప్పటికే విజయేంద్ర రాజకీయం చాలా వాడీవేడిగా నిలిచింది. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు ఆయన తనయుడే యాక్టింగ్ సీఎంగా వ్యవహరించాడనే పేరుంది. ఈ విషయంలో చేసేది లేకే.. యడియూరప్పను సీఎం పీఠం నుంచి ఢిల్లీ వాళ్లు దించేశారనే టాక్ కూడా ఉంది. అయితే యడియూరప్ప తనయుడిని ప్రమోట్ చేసుకోవడంలో తగ్గేదేలా అంటున్నారు. తన వారసుడు కర్ణాటక మొత్తాన్నీ దున్నేస్తాడనే రేంజ్ లో ప్రకటించేశారు యడియూరప్ప!
ఇలాంటి ప్రకటనలు వేరే పార్టీ నేతలు చేసి ఉంటే.. కమలనాథులు తెగ ఆందోళన ప్రకటించేవారు. అయితే బీజేపీ ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం.. అదంతా దేశం కోసం ధర్మం కోసమే! వాట్సాప్ యూనివర్సిటీ ఆపై అందుకుంటుంది!