తాజా విమాన ప్రమాదంతో మరోసారి నేపాల్ వార్తల్లోకెక్కింది. విమాన ప్రమాదాలు, అందులోనూ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ప్రమాదాలు నేపాల్ లోనే జరుగుతున్నాయి. గత 30 ఏళ్లలో నేపాల్ లో 27 విమాన ప్రమాదాలు జరిగాయంటే ఆశ్చర్యం వేయక మానదు. అంటే, సగటున ఏడాదికో భారీ ప్రమాదం అన్నమాట.
అందుకే నేపాల్ విమానాలపై యూరోపియన్ యూనియన్ 2013లో ఆంక్షలు విధించింది. నేపాల్ విమానాలను తమ గగనతలంపై నిషేధించింది.
నేపాల్ కి ఉన్న శాపం ఏంటి.. ?
నేపాల్ లో జరిగే విమాన ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. ప్రకృతి ప్రకోపం అందులో ప్రధానమైనది. ఎప్పుడెలా ఉంటుందో తెలియని వాతావరణ పరిస్థితి నేపాల్ లో ఉంటుంది. అక్కడ వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి. అంతా బాగుంది అంటూ ఎయిర్ ట్రాఫిక్ విభాగం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, మధ్యలో ఏదో ఒక చోట హఠాత్తుగా వాతావరణం మారిపోతుంది. అందుకే నేపాల్ లో విమానం టేకాఫ్ అయిన దగ్గర్నుంచి, ల్యాండింగ్ అయ్యే వరకు అందరూ టెన్షన్ టెన్షన్ గా ఉంటారు. వీటన్నింటికీ ప్రధాన కారణం హిమాలయాలు. ఈ మహా పర్వత సానువుల వల్ల విమాన ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతుంటాయి.
గతేడాది మేలో జరిగిన ప్రమాదంలో మొత్తం 22మంది చనిపోగా, ఈ ఏడాది తాజాగా జరిగిన ప్రమాదం, మరింత ఘోరం. అసలు నేపాల్ విమానాలంటేనే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. పైలట్ల పనితీరు, వారి సమర్థతపై కూడా అనుమానాలున్నాయి. నేపాల్ విమానయాన సంస్థల్లో పనిచేసే పైలట్లు అరకొర శిక్షణతో క్యాబిన్ లో కూర్చుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ఇతర దేశాల్లో ఉన్న కఠిన నిబంధనలు ఇక్కడ పైలట్లకు ఉండవు. విమానయాన సంస్థల పనితీరు కూడా అంతంతమాత్రమే. కొత్త విమానాలు ఉండవు. ఇతర దేశాల నుంచి సెకండ్ హ్యాండ్ విమానాలను కొనుగోలు చేసి, వాటికి మరమ్మతులు చేసి నేపాల్ విమాన సంస్థలు నడుపుతుంటాయనేది బహిరంగ రహస్యం.
తాజాగా ప్రమాదానికి గురైన విమానం కూడా కొత్తది కాదు. గతంలో కింగ్ ఫిషర్ కంపెనీ వాడిన విమానం అది. ఇలా కొనుగోలు చేసిన సెకెండ్ హ్యాండ్ విమానాల నిర్వహణ కూడా దారుణంగా ఉంటుంది. అందుకే ప్రమాదాలు ఎక్కువ. గత 30ఏళ్లలో జరిగిన 27 ప్రమాదాల్లో 20 ప్రమాదాలకు కారణం నేపాల్ విమానాలు, వాటిని నడిపిన నేపాల్ పైలట్లే కావడం బాధాకరం.