టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భలే అద్భుతంగా చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆణిముత్యం లాంటి మాటలు ఆయన చెప్పారు. ఈ నెల 27నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. సైకో సీఎంను ఇంటికి సాగనంపేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
అధికారంలోకి రాగానే మంగళగిరిలో 10 వేల ఇళ్లు కట్టిస్తామని ఆయన హామీ ఇవ్వడం గమనార్హం. ఇంటి పట్టాలు లేనివారికి గెలిచిన మూడు నెలల్లోనే బట్టలు పెట్టి మరీ పట్టాలిస్తామని లోకేశ్ హామీ ఇవ్వడం విశేషం. నున్న ఎన్నికల్లో మరోసారి మంగళగిరి నుంచే పోటీ చేస్తానని గతంలో ఆయన ప్రకటించారు. ఈ దఫా గెలుపును గిఫ్ట్‌గా ఇస్తానని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.
గతంలో అధికారంలో వున్నప్పుడు మంగళగిరికి ఏమీ చేయకుండా …ఇప్పుడు వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని హామీ ఇవ్వడం లోకేశ్‌కే చెల్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో కీలక భాగస్వామిగా, మంత్రిగా లోకేశ్ అంతా తానై నడిపిస్తున్నప్పుడు జనాన్ని పట్టించుకోలేదని తప్పు పడుతున్నారు.
ఒక్కసారి ఓడిస్తే తప్ప, లోకేశ్‌కు జ్ఞానోదయం కాని పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇంటి స్థలాలు ఇస్తాం, ఇళ్లు కట్టిస్తామని చెప్పడానికి నోరెలా వస్తోందో అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పేదల గురించి ఆలోచించిన దాఖలాలు లేవని, అందుకే టీడీపీని, లోకేశ్‌ను ఓడించారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా పేదలకు ఇళ్లు కట్టించాలన్న ఆలోచన వచ్చినందుకు సంతోషమని నెటిజన్లు వెటకరిస్తున్నారు.