కేసీఆర్ ఆట మొద‌లైంది

1975 జూన్ 25, ఢిల్లీ రాంలీలా మైదానం. ల‌క్ష‌ల జ‌నం. లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ “సింహాస‌నం ఖాళీ చేయండి, ప్ర‌జ‌లు వ‌స్తున్నారు” అని గ‌ర్జించాడు. ఆ రోజు అర్ధ‌రాత్రి. ఇందిరాగాంధీ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. Advertisement…

1975 జూన్ 25, ఢిల్లీ రాంలీలా మైదానం. ల‌క్ష‌ల జ‌నం. లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ “సింహాస‌నం ఖాళీ చేయండి, ప్ర‌జ‌లు వ‌స్తున్నారు” అని గ‌ర్జించాడు. ఆ రోజు అర్ధ‌రాత్రి. ఇందిరాగాంధీ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది.

ఇందిరాగాంధీ ఉక్కు మ‌హిళ‌, ఆమెకి ఎదురే లేదు. ఆ రోజు ఎవ‌రికీ అర్థం కాలేదు. ఒక బ‌క్క మ‌నిషికి ఆమె భ‌య‌ప‌డుతుందని. దేశ‌మంతా బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దించ‌డం అసాధ్యం అనుకున్నారు. 1977లో సాధ్య‌మైంది. కార‌ణాలు ఏమైతేనేం జ‌న‌తా ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. అది వేరే విష‌యం.

ఎదురే లేద‌నుకున్న బీజేపీకి కేసీఆర్ అనే బ‌క్క మ‌నిషి బ్రేక్ వేస్తాడా? య‌డానికి ప్ర‌య‌త్నం మొద‌లైంది. ఖ‌మ్మం స‌భ స‌క్సెస్‌. హేమాహేమీలు వ‌చ్చారు. వాళ్ల‌లో కేజ్రీవాల్‌, పిన‌ర‌యి విజ‌య‌న్‌కి జ‌నంలో అత్యంత విశ్వ‌స‌నీయ‌త వుంది.

కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మం ప్రారంభించిన‌ప్పుడు వెంట ఎవ‌రూ లేరు. మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డం వ‌ల్ల మొద‌లైన ఆగ్ర‌హం అన్నారు. తెలంగాణ అసాధ్య‌మ‌న్నారు. న‌వ్వుకున్నారు, హేళ‌న చేశారు. అయినా ఆయ‌న త‌గ్గ‌లేదు. ఎన్నోసార్లు ఎదురు దెబ్బ‌లు తిన్నాడు. ప‌డిన ప్ర‌తిసారి పైకి లేచాడు. ఏళ్ల త‌ర‌బ‌డి అనేక శ‌క్తుల‌తో యుద్ధం చేశాడు. అంద‌రూ అసాధ్య‌మ‌న్న తెలంగాణ‌ని తెచ్చి చూపించాడు. ఎంత ఉద్రిక్త‌త ఎదురైనా ర‌క్త‌పాతానికి అవ‌కాశం లేకుండా తెచ్చాడు.

తెలంగాణాని ఊపిరిగా భావించే కేసీఆర్, త‌న పార్టీ నుంచి ఆ ప‌దాన్ని తొల‌గించి, భార‌త్ చేర్చేస‌రికి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. తెలంగాణాకే ప‌రిమిత‌మైన ప్రాంతీయ పార్టీ దేశ‌మంతా విస్త‌రించ‌డం అసాధ్యం. వయ‌సు పెరిగే స‌రికి కేసీఆర్‌కి భ్ర‌మ‌లు, భ్రాంతులు పెరిగాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అనుకున్నారు. ఒక ర‌కంగా అది నిజం కూడా. స‌రిహ‌ద్దుల్లోని మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌లో కొంత ఓటు బ్యాంక్ ఉంది కానీ, అది సీట్లు గెలిచే స్థాయిలో లేదు. అక్క‌డ బ‌లంగా ఉన్న పార్టీలు కేసీఆర్ మ‌ద్ద‌తు కోరుతాయి కానీ, పొత్తు పెట్టుకోవు. రోజూ టీ దుకాణాల ద‌గ్గ‌ర పేప‌ర్లు చ‌దివే వాళ్ల‌కే ఈ మాత్రం లాజిక్ అర్థ‌మైన‌ప్పుడు కేసీఆర్ ఎందుకు మిస్ అయ్యాడు. మిస్ అవ‌లేదు. ఎత్తుగ‌డ‌ల్ని ఎదుటి వాళ్ల‌కి అర్థం కాకుండా చేయ‌డంలో దిట్ట‌. చ‌ద‌రంగ‌మైనా, ఎన్నిక‌ల ర‌ణ‌రంగ‌మైనా ఆయ‌న ఆట వేరే.

త‌న పార్టీని దేశ‌మంతా విస్త‌రింప‌జేయ‌డం ల‌క్ష్యం కాదు. అంద‌రినీ క‌లుపుకుని బీజేపీ వ్య‌తిరేక‌త‌ని సృష్టించ‌డం టార్గెట్‌. ఖ‌మ్మం స‌భ దీనికి నాంది. ముగ్గురు ముఖ్య‌మంత్రుల్ని, ఒక మాజీ ముఖ్య‌మంత్రిని ర‌ప్పించ‌డం చిన్న విష‌యం కాదు. అది కేసీఆర్ క్రెడిబులిటి. తానొక్క‌డే బీజేపీని విమ‌ర్శించ‌డం వేరు. అన్ని రాష్ట్రాల ప్ర‌ముఖుల‌తో ఒక వేదిక మీద విమ‌ర్శించ‌డం వేరు. బీజేపీ ప్ర‌తికూల‌త‌ని జ‌నంలోకి వెళ్లేలా చేస్తే ముందు తాను సేఫ్‌. టైమ్ బాగుండి త‌మ కూట‌మికి నూరు సీట్లు దాటితే కేంద్రంలో చ‌క్రం తిప్పే అవ‌కాశం రావ‌చ్చు. చ‌రిత్ర‌లో ఎన్ని జ‌ర‌గ‌లేదు.

తెలంగాణ‌లో బీజేపీకి క‌నీసం 30 సీట్లు వ‌చ్చినా కేసీఆర్‌కి ప్ర‌మాద‌మే. ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ఎత్తుగ‌డ‌ల్లో కూలిపోయిన పార్టీలు క‌ళ్ల ముందే ఉన్నాయి. అందుక‌ని ఆ అవ‌కాశం రాకుండా చేయాలంటే తానొక్క‌డి పోరాటం కంటే ఉమ్మ‌డి పోరాట‌మే సేఫ్ అనుకుని పార్టీ పేరు కూడా మార్చి రంగంలోకి దిగాడు.

అధికారం కోసం పోటీ ప‌డేంత స్పేస్ గ‌తంలో బీజేపీకి లేదు. అయితే కాంగ్రెస్‌ని వీక్ చేయాల‌నుకుని, తానే స్వ‌యంగా బీజేపీని నెత్తి మీదకి కేసీఆర్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ కొమ్ములు వంచాల‌నుకుని, కొమ్ములు, కోర‌లు రెండూ ఉన్న బీజేపీని పోటీకి తెచ్చుకున్నాడు.

ఖ‌మ్మం స‌భ ఆరంభం మాత్ర‌మే. ఇంకా చాలా వుంటాయి. ఆట ఇప్పుడే క‌దా మొద‌లైంది.

జీఆర్ మ‌హ‌ర్షి