కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన ప్రయత్నాన్ని చాలా కాలం నుంచి కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అన్ని పార్టీలూ ఆయనకు సమానంగా రెస్పాండ్ కావడం లేదు.
కొందరు ఇతర పార్టీల నాయకులు ఆయన మాటలకు మద్దతిస్తూ వెంట నిలుస్తోంటే, మరికొందరు కీలక నాయకులు కేసీఆర్ ప్రయత్నాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అయితే ఆ రకంగా కేసీఆర్ ను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఇతర జాతీయ స్థాయి నాయకుల్లో ఖమ్మం సభ మార్పు తెస్తుందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఖమ్మంలో విజయవంతంగా జరిగింది. జనం భారీగా హాజరయ్యారు. మూడురాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. కేసీఆర్ ప్రయత్నానికి మద్దతిచ్చారు. కేసీఆర్ పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని చెప్పారు.
నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న జాతీయ రాజకీయాల ప్రయత్నాల్లో వారందరూ జట్టుగా ఉంటారని స్పష్టం చేసినట్టే. ఆప్ సారధి కేజ్రీవాల్ ఏకంగా, కేసీఆర్ తమకు పెద్దన్న అని వ్యవహరించడానికి ఎవరికి తోచినట్లు వారు భాష్యం చెప్పుకోవచ్చు.
కేసీఆర్ ప్రధానంగా జాతీయ రాజకీయాల్లో భాజపాయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారు.రెండు పార్టీలకు సమానదూరం ఉండే కూటమి కావాలంటున్నారు. అందుకోసమే ఆయన అన్ని పార్టీల నాయకులను కలుస్తూ తన వాదన వినిపిస్తున్నారు.
తెలంగాణ స్థానిక రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ తో కూడా వైరం పాటించడం కేసీఆర్ వ్యక్తిగత అవసరం అనే అభిప్రాయం కొందరికి ఉంది. జాతీయ రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు.. బిజెపిని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ను పక్కన పెట్టాలనే ధోరణి అనవసరం అని కొందరు నాయకులు నమ్ముతున్నారు. వారంతా కేసీఆర్ వాదనను పట్టించుకోవడం లేదు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను ఇక్కడ పరిగణించాలి. కాంగ్రెస్ లేకుండా దేశంలో ప్రత్యామ్నాయం సాధ్యమే కాదని వాదించే నేత నితీశ్. అందుకు ఆయన స్థానిక రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల మీద కోరిక కూడా కారణం కావొచ్చు గానీ.. ఖమ్మం సభ విజయవంతం అయిన తీరు, కేజ్రీవాల్, అఖిలేష్, పినరయి విజయన్ తదితరులు కేసీఆర్ తో జట్టుకట్టిన తీరు గమనిస్తే నితీశ్ వంటి వారి వాదనలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
బిజెపికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటయ్యే కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండి తీరాల్సిందే అనే వాదనకు పరిమితమైన వారు.. ఖమ్మం సభ తర్వాత.. తమ ఆలోచన మార్చుకుంటే కేసీఆర్ సక్సెస్ అయినట్టు లెక్క. లేదా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను కూడా సమానంగా దూరం పెట్టాలనే పట్టుదలను కేసీఆర్ కాస్త సడలించుకోవచ్చు.
మొత్తానికి ఖమ్మం సభ కేసీఆర్ తలపోస్తున్న జాతీయ కూటమికి కొంత ఉత్సాహం ఇచ్చిందనే చెప్పాలి.