మోడీని తిట్టడానికి తప్ప.. ఏపీపై ప్రేమ లేదా?

తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి సారథి కేసీఆర్ ఖమ్మంలో తన జాతీయ పార్టీ ఆవిర్భావ సభను చాలా ఘనంగా నిర్వహించారు. విజయవంతం చేశారు. మూడురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం రావడమూ.. కేసీఆర్…

తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి సారథి కేసీఆర్ ఖమ్మంలో తన జాతీయ పార్టీ ఆవిర్భావ సభను చాలా ఘనంగా నిర్వహించారు. విజయవంతం చేశారు. మూడురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం రావడమూ.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగులకు మద్దతివ్వడమూ జరిగింది.మోడీని ఎందుకు ఓడించాలో ఈ సభలో కేసీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. దేశాన్ని తాను ఏ రకంగా ఉద్ధరించదలచుకుంటున్నానో కూడా చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అంశాలను కూడా ప్రస్తావిస్తూ.. అక్కడి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి పొరుగున ఉన్న, ఇప్పటికే పార్టీ రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించిన ఏపీ విషయంలో కేసీఆర్ ఏం చెప్పారు? ఏం వరాలు ఇచ్చారు?

ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో కేసీఆర్ ప్రస్తావించినది ఒకే ఒక్క విశాఖ ఉక్కు వివాదం మాత్రమే. ఎల్ఐసీ,రైల్వే వంటి వ్యవస్థలను ప్రెవేటీకరించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మోడీ మీద నిందలు వేసిన కేసీఆర్, పనిలో పనిగా విశాఖ ఉక్కును కూడా ప్రస్తావించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను బిజెపి ప్రభుత్వం అమ్మేస్తే, తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ కొంటాం అని కేసీఆర్ ప్రకటించారు. 

ఈ ఒక్క మాట తప్ప.. ఏపీ వ్యవహారాల గురించి కేసీఆర్ చెప్పిందేమీ లేదు. విశాఖ ఉక్కు అంశాన్ని ప్రస్తావిస్తే మోడీ మీద నిందలు వేయడానికి అవకాశం దొరుకుతుందని కేసీఆర్ అనుకున్నట్టుగా కనిపిస్తోంది.బిజెపి అమ్మేస్తే తర్వాత తాము అధికారంలోకి రాగానే కొనేస్తాం అంటూ.. కేసీఆర్ అదేదో బొమ్మలాట వ్యవహారంలాగా చెప్పేస్తున్నారు. వినేవాళ్లు అంతా వెర్రివాళ్లని, తాను ఏం చెప్పినా నమ్మేస్తారని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. 

‘బిజెపి అమ్మేస్తే తాము కొంటాం’ అంటూ ఆచరణ సాద్యం కాని ప్రకటనలు తప్ప.. ‘‘అమ్మడానికి పూనుకుంటే, దానిని జరగనివ్వం, అడ్డుకుంటాం, దేశాన్నంతా ఒక్కటి చేసి దానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం. విశాఖ ఉక్కును అమ్మేయాలనే ఆలోచనకు వ్యతిరేకంగా విశాఖ ప్రాంతంలో, ఏపీ రాష్ట్రంలో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టి.. దేశవ్యాప్త పోరాటం చేస్తాం’’ లాంటి గట్టి మాటలు కేసీఆర్ చెప్పనే లేదు. ఒక పోరాటానికి ఒక జాతీయ పార్టీ మద్దతిస్తున్నదంటే ప్రజలు ఆశించేది ఇదీ! అంతే తప్ప ‘అమ్మితే తిరిగి కొంటా’ లాంటి డాంబికపు మాటలు కాదు. 

భారాసకు తెలంగాణలో తప్ప ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏకైక అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. కొత్తగా పదవి వచ్చిన అత్యుత్సాహంలో ఆయన కేసీఆర్ ఖమ్మం సభకు జనాన్ని తరలించడానికి ఏపీలో పలుచోట్ల ఫ్లెక్సిలు వేశారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రనుంచి జనాన్ని తరలించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అలా ఉత్తరాంధ్రనుంచి వచ్చిన వారికి కంటితుడుపుగా ఉంటుందని, మోడీని తిట్టడానికి అనుకూలంగా ఉంటుందని.. విశాఖ ఉక్కు గురించి ఓ మాట చెప్పినట్టు ఉన్నదే తప్ప, చిత్తశుద్ధితో ఏపీ ప్రయోజనాల గురించి శ్రద్ధతో చెప్పినట్టులేదు. మరి ఇలాంటి పోకడతో కేసీఆర్ ఎలా పార్టీని ముందుకుతీసుకువెళతారో చూడాలి.