పెద్ద ఉద్యోగం వదిలేసింది.. టీ కొట్టు పెట్టుకుంది

చాలామంది చిన్నప్పటినుంచి ఏదో ఒక లక్ష్యం కోసం ఆరాటపడతారు. కానీ చివరకు మరో ఉద్యోగంలో చేరతారు. కుటుంబ బాధ్యతలు, లేక ఇతరత్రా కారణాల వల్ల.. ఏదో ఒక ఉద్యోగంలో బందీ అయిపోతారు, తమ కలలను…

చాలామంది చిన్నప్పటినుంచి ఏదో ఒక లక్ష్యం కోసం ఆరాటపడతారు. కానీ చివరకు మరో ఉద్యోగంలో చేరతారు. కుటుంబ బాధ్యతలు, లేక ఇతరత్రా కారణాల వల్ల.. ఏదో ఒక ఉద్యోగంలో బందీ అయిపోతారు, తమ కలలను మరచిపోతారు. కానీ శర్మిష్ట ఘోష్ మాత్రం అలా కాదు.. తన కల నెరవేర్చుకోవడం కోసం ఉన్నత ఉద్యోగం కూడా వదిలేసింది. టీ కొట్టు పెట్టేందుకు ఆమె బ్రిటిష్ కౌన్సిల్ ఉద్యోగాన్ని కూడా పక్కనపెట్టింది.

ఢిల్లీకి చెందిన శర్మిష్ట ఘోష్.. ఇంగ్లిష్ లో ఎంఏ చదివింది. ఆమెకు ఓ స్టార్టప్ కంపెనీ పెట్టాలనే కల ఉంది. అది కూడా ఫుడ్ సెక్షన్లో. టీ, సమోసా, ఇతర తినుబండారాలతో తన బ్రాండ్ ఇమేజ్ తో ఢిల్లీలోనే పేరు తెచ్చుకోవాలనేది శర్మిష్ట ఘోష్ కల. కానీ కుటుంబ అవసరాల కోసం ఆమె ఉద్యోగం చేయాల్సి వచ్చింది.

ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీలో ఉద్యోగం చేసేది శర్మిష్ట. కొన్నిరోజులకే ఆమెకు ఆ పని బోర్ కొట్టింది. హడావిడిగా ఉండాల్సిన తన జీవితం, లైబ్రరీలో సైలెంట్ గా ఉండటాన్ని ఆమె ఇష్టపడలేదు. అందుకే ఉద్యోగాన్ని వదులుకుని ఆమె ఢిల్లీలోని గోపీనాథ్ బజార్ లో టీ స్టాల్ ప్రారంభించింది. టీతోపాటు ఇతర ఫుడ్ ఐటమ్స్ ని కూడా తోపుడు బండిపై పెట్టుకుని అమ్ముతోంది శర్మిష్ట.

ఆమెతోపాటు మరికొందరు కూడా పార్టనర్స్ ఉన్నారు. ఒకే బ్రాండ్ పేరుతో వారంతా ఢిల్లీలో వ్యాపారం విస్తరించాలని అనుకుంటున్నారు.

మాజీ సైనికోద్యోగి బ్రిగేడియర్ సంజయ్ ఖన్నా ద్వారా శర్మిష్ట స్టోరీ వెలుగులోకి వచ్చింది. టీ స్టాల్ కి వెళ్లిన సంజయ్ ఖన్నా, అద్భుతంగా ఇంగ్లిష్ మాట్లాడుతున్న ఆమెను చూసి షాకయ్యారు. వెంటనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీలో ఉద్యోగాన్ని కూడా వదులుకుందని తెలిసి మరింత ఆశ్చర్యపోయారు. లింక్డిన్ వెబ్ సైట్ లో ఆమె డేరింగ్ స్టెప్ ని పోస్ట్ చేశారు. దీంతో శర్మిష్ట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఢిల్లీలో ఇప్పుడామె పేరు మారుమోగిపోతోంది.

ఉన్నతమైన విద్యార్హతలు, ఉన్నతమైన ఉద్యోగం, అంతకంటే ఉన్నతమైన జీతం ఉంటేనే జీవితం అనుకోకూడదంటోంది శర్మిష్ట. చేసే పని ఎంత చిన్నదైనా దాన్ని గౌరవంగా భావించాలని, ఇష్టమైన పనితోనే జీవితం సుఖమయంగా ఉంటుందని అన్నారు. అందుకే తన కలను నిజం చేసుకోడానికి ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టానంటోంది శర్మిష్ట. కలలు కనడం కాదు, ఆ కలను నెరవేర్చుకునే ధైర్యం ఉన్నవారే అసలైన విజేతలు.