పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ని చైనా ఎప్పటినుంచో పాటిస్తోంది. జనాభా సంఖ్యలో తగ్గేదే లేదంటుంది చైనా. అయితే ఇటీవల చైనాను భారత్ దాటేసేందుకు స్పీడ్ గా వెళ్తోంది. కానీ దీనికి కారణం చైనా కాదు. మనోళ్లు చైనా కంటే స్పీడ్ మీదున్నారంతే. ఇలాంటి పరిస్థితి నుంచి తొలిసారిగా చైనా జనాభా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.
60 ఏళ్లలో తొలిసారి చైనా జనసంఖ్య పడిపోయింది. జననాల రేటు తగ్గిపోవడంతో 2021తో పోల్చుకుంటే 2022లో చైనా జనాభా 8,50,000 తగ్గింది. 2022 నాటికి చైనా జనాభా 141.18 కోట్లు. 1961 తర్వాత చైనాలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి.
భారీ జనాభాతో సతమతమయ్యే చైనా.. 1979లో వివాదాస్పద వన్ చైల్డ్ పాలసీ ప్రవేశ పెట్టింది. అయినా కూడా చైనాలో జనాభా ఏనాడూ తగ్గలేదు. ఆ తర్వాత పెరుగుదల కాస్త నెమ్మదించింది అంతే. కానీ ఏడాదికేడాది జనాభా పెరుగుతూ పోతోంది.
2016లో చైనాలో 2 చైల్డ్ పాలసీ ప్రవేశ పెట్టారు. కానీ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జననాల రేటు తగ్గడం, అదే సమయంలో మరణాల రేటు విపరీతంగా పెరగడంతో జనసంఖ్య తగ్గుముఖం పట్టింది.
జననాల రేటులో భారీ క్షీణత..
చైనాలో ప్రతి 1000 మంది జనాభాకు జననాల రేటు కేవలం 6.77గా నమోదైంది. 2021లో జననాల రేటు 7.52గా ఉంది. 2022లో అది కేవలం 6.77 మాత్రమే. అమెరికాలో ప్రతి 1,000 మందికి 11.06 మంది జన్మిస్తున్నారు. యూకేలో జననాల రేటు 10.08 . భారత్ లో జననాల రేటు 16.42 కావడం గమనార్హం.
మరణాల రేటు పెరుగుదల..
చైనాలో గతేడాది తొలిసారిగా జననాల కంటే మరణాల రేటు పెరిగింది. 2022లో ప్రతి 1,000 మందికి చైనాలో 7.37 మంది చనిపోయారు. 2021లో మరణాల రేటు 7.18 గా ఉంది. చైనాతోపాటు దక్షిణ కొరియా, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో కూడా జనాభా తగ్గుతోంది. ఆయా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరగడం కలవరపెట్టే అంశం.
చైనాలో అధిక నిరుద్యోగిత రేటు ఉంది, ఆదాయ అంచనాలు కూడా చాల తక్కువ. దీంతో వివాహ వయస్సు పెరిగిపోతోంది, మాతృత్వాన్ని చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జననాల రేటు భారీగా పడిపోయింది. మరణాల రేటు కంటే అది తక్కువగా ఉండటంతో.. తొలిసారి చైనాలో జనాభా తగ్గింది. 2023లో చైనా జనాభా మరింత తగ్గే అవకాశముంది.