చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ మరోసారి ఎన్నికై చరిత్ర సృష్టించారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మెన్‌గా కూడా ఆయన ఎన్నికయ్యారు. చైనా ఉపాధ్యక్షుడిగా హాన్ జంగ్ ఎన్నికయ్యారు. మార్చి 10న జరిగిన సమావేశంలో 2,952 ఓట్లు ఏకగ్రీవంగా జిన్‌పింగ్‌కు పోలయ్యాయి.
గతేడాది జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభల్లో స్టాండింగ్ కమిటీ జిన్‌పింగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. దీంతో పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తరువాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా 69 ఏళ్ల జిన్‌పింగ్ నిలిచారు.
చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68, రెండుసార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న కమ్యూనిస్టు పార్టీ నియమం ఉన్నప్పటికి 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. దీంతో జిన్‌పింగ్ తన జీవిత కాలం అధ్యక్షుడిగా కొనసాగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.