యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. లెక్కలేనన్ని థంబ్ నెయిల్స్. వివాదం రేపేవి కొన్ని, ఇట్టే ఎట్రాక్ట్ చేసేవి మరికొన్ని.. నిజమేమో అని భ్రమింపజేసేవి ఇంకొన్ని.. రెచ్చగొట్టేవి మరిన్ని. వీటి స్వభావం ఎలా ఉన్నప్పటికీ, వీడియో లోపల ఉన్న కంటెంట్ తో సంబంధంలేని థంబ్ నెయిల్సే ఎక్కువ.
దీనివల్ల ప్రేక్షకుడు విసిగిపోయాడు. యూట్యూబ్ లో వచ్చే విషయాన్ని నమ్మడం మానేశాడు. ఫలితంగా యూట్యూబ్ తన విశ్వసనీయతను కోల్పోయింది. ఇన్నాళ్లకు ఆ సంస్థ ఈ అంశంపై సీరియస్ గా దృష్టిపెట్టింది.
బ్రేకింగ్ న్యూస్, కరెంట్ ఎఫైర్లకు సంబంధించి థంబ్ నెయిల్స్ తో పెట్టే వీడియోల్ని తొలిగించబోతున్నట్టు గూగుల్ ప్రకటించింది. ప్రస్తుతం చాలామంది కంటెంట్ క్రియేటర్లు మోసపూరిత శీర్షికలను ఉపయోగిస్తున్నారు. ఇది తరచుగా అపార్థాలకు దారితీస్తోంది. కొంతమందికి అది హానికరంగా కూడా మారుతోంది. వీక్షకులను, ముఖ్యమైన సమాచారం కోసం వెదికే వాళ్లను ఈ రకమైన శీర్షికలు మోసగిస్తున్నాయని, చిరాకు తెప్పిస్తున్నాయని యూట్యూబ్ అభిప్రాయపడింది.
త్వరలోనే ఇలాంటి మోసపూరిత థంబ్ నెయిల్స్ తో ఉన్న వీడియోల్ని తొలిగించే ప్రక్రియను భారత్ లో దశలవారీగా ప్రారంభిస్తామని యూట్యూబ్ ప్రకటించింది. దీనికి మరికొన్ని నెలల సమయం పడుతుందని కూడా తెలిపింది.
కంటెంట్ క్రియేటర్స్ కు యూట్యూబ్ కొంత సమయం ఇస్తుంది. ఆ టైమ్ లోగా నూతన గైడ్ లైన్స్ కు తగ్గట్టు తమ ఛానెల్ లో ఉన్న థంబ్ నెయిల్స్ ను వారు సరిదిద్దుకోవాలి. గడువు తీరిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్ ఏమైనా ఉంటే, వాటిని యూట్యూబ్ పూర్తిగా డిలీట్ చేస్తుంది. ఈ విషయంలో కంటెంట్ క్రియేటర్స్ పై ఎలాంటి పెనాల్టీలు ఉండవని తెలిపింది.
నిజానికి యూట్యూబ్ ఈ దిశగా చాన్నాళ్ల కిందటే చర్యలు చేపట్టింది. క్లిక్ బైట్ సమస్యల్ని పరిష్కరించడం కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేసింది. అయితే అదేమంత ఫలితాన్నివ్వలేదు. దీంతో ఈసారి నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించింది.
అయితే అలాంటి వీడియోల్ని ఎలా గుర్తిస్తుంది, ఎలాంటి ప్రమాణాలు నిర్దేశిస్తుంది లాంటి అంశాలపై యూట్యూబ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు.. కంటెంట్ క్రియేటర్లకు కూడా ఇప్పటివరకు ఎలాంటి డెడ్ లైన్స్ విధించలేదు.
I think ur spot some use less topics because promiseing reders headache that news plz ignore