భారతీయ జనతా పార్టీ, ఎన్సీపీ.. ఈ రెండు పార్టీలూ పెద్ద శత్రువులే. మహారాష్ట్ర రాజకీయంలో అయినా, ఢిల్లీలో అయినా ఈ రెండు పార్టీలూ ప్రత్యర్థులే. ఇటీవలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై ఈడీ, సీబీఐ కేసులు కూడా మొదలయ్యాయి. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పవార్ కు నోటీసులు వచ్చాయి. వాటిపై ఆయన ఫైర్ అయ్యాడు.
ఎన్నికల్లో ఈ ఇరు పార్టీలూ పలు నియోజకవర్గాల్లో తలపడ్డాయి. ఎన్సీపీ మెరుగైన ఫలితాలే సాధించినా అధికారానికి దగ్గర కాలేకపోయింది. బీజేపీ, ఎన్సీపీల రాజకీయ వైరం గురించి ఈ ఉపోద్ఘాతం అంతా అక్కర్లేదు కూడా.
అయినా ఇప్పుడు బీజేపీకి ఎన్సీపీ చేస్తున్న మేలును చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు బీజేపీని బెదిరించడానికి శివసేన ఎన్సీపీని చూపుతూ ఉంది. తాము, ఎన్సీపీ అధికారాన్ని పంచుకుంటామని, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందన్నట్టుగా శివసేన లీకులు ఇస్తూ ఉంది. బీజేపీని దారికి తెచ్చుకోవడానికి సేన ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంది.
అయితే ఎన్సీపీ కుండబద్దలు కొడుతూ ఉంది. ఒకటికి పది సార్లు చెబుతూ ఉంది.. తాము ప్రతిపక్షంలోనే ఉంటామని. అధికారాన్ని పంచుకునే ఆలోచన లేదంటూ..ఎన్సీపీ వరసగా ప్రకటనలు చేస్తూ ఉంది. శివసేన సై అంటున్నా, ఎన్సీపీ నై అంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
ఎన్సీపీ కామ్ గా ఉన్నా అడిగే వాళ్లు లేరు. అయితే ఎన్సీపీ వాళ్లే కావాలని స్పందిస్తున్నారు. శివసేన ఆలోచనలకు నో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా సేనకు ఝలక్ ఇస్తోంది ఎన్సీపీ. ఇది అంతిమంగా బీజేపీకి ప్లస్ అవుతోంది. ఎన్సీపీని బూచిగా చూపి బీజేపీని లొంగదీయాలని సేన భావిస్తుంటే, ఎన్సీపీ మాత్రం ఆ ఆలోచనే లేదంటూ.. సేనను నిస్పృహకు గురి చేస్తూ, బీజేపీకి కావాల్సినంత బలాన్ని ఇస్తోంది!