కరోనా ముందు ఆగిపోయిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి 126 జడ్పీటీసీ స్థానాలు, 2363 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే వాటిని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో విచారణ జరపాలంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు నిమ్మగడ్డ.
అయితే రిటర్నింగ్ ఆఫీసర్ల అధికారాలు అడ్డుకోవడం ఎస్ఈసీకి తగదంటూ ఏకగ్రీవాల అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించారు. దీంతో కోర్టు కూడా ఏకగ్రీవాల విషయంలో జోక్యం చేసుకోవద్దని సీరియస్ గా చెప్పేసింది.
కానీ ఈ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత తాజాగా కోర్టులో మరో కౌంటర్ అఫిడవిట్ వేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఎన్నికలను నిష్పాక్షపాతంగా, స్వచ్ఛంగా నిర్వహించే పరిస్థితులు కల్పించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉందని అంటూ కౌంటర్ అఫిడవిట్ తో తెలిపారు.
పర్యవేక్షణ, నిర్దేశం, నియంత్రణ అధికారాలు ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ కు ఉన్నాయని గుర్తు చేశారు. నామినేషన్ల దాఖలులో అవరోధాలు, బలవంతపు ఉపసంహరణ విషయంలో అందిన ఫిర్యాదులపై విచారణ నిలుపుచేస్తూ ఫిబ్రవరి 19న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలని కోరారు.
అసలేంటీ పట్టుదల..? ఎన్నికల కమిషన్ కు సజావుగా ఎన్నికలు జరిపే అధికారాలు ఎలా ఉంటాయో.. ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన వారికి ఫామ్ 10 ఇచ్చి వారి గెలుపుని ధృవీకరించే అధికారం కూడా ఆర్వోలకు ఉంటుంది. అయితే ఆ అధికారాల్లో వేలు పెడతామంటూ ఎస్ఈసీ అంటున్నారు.
కుదరదని కోర్టు స్పష్టం చేసింది, ఏకగ్రీవాల తర్వాత ఈ రచ్చేంటని విజేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ దశలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి, మరోసారి తన పంతం నెగ్గించుకోవాలనుకుంటున్నారు నిమ్మగడ్డ. ఏకగ్రీవాలను ఎలాగైనా రద్దు చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
ఓసారి కుదరదని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎస్ఈసీ పట్టుదలతో వ్యహరించడం ఇటు ప్రభుత్వాన్నే కాదు, అటు ప్రజలు కూడా విస్తుపోయేలా చేస్తోంది.
అసలింతకీ నిమ్మగడ్డ ఆంతర్యం ఏంటి? పదే పదే కోర్టుని ఆశ్రయిస్తే ఫలితం ఉంటుందా? వాలంటీర్ల ఫోన్లు తీసేసుకోవాలంటూ రెండోసారి తాను చేసిన అభ్యర్థనకు కోర్టు సమ్మతించడంతో.. అదే రీతిలో ఏకగ్రీవాలపై మరో ప్రయత్నం మొదలు పెట్టారు నిమ్మగడ్డ. చివరాఖరి ఆశతో కౌంటర్ అఫిడవిట్ వేశారు.