నిషేధం మాటున విషాదం!

ఆంధ్రప్రదేశ్‌లో దశల వారీ మద్య నిషేధం మాటెలా ఉన్నా మందుబాబులు మాత్రం విషాద సాగరంలో మునిగితేలుతున్నారు. గతంలో సిండికేట్ల చేతుల్లో మద్యం ఉన్నపుడు మద్యం ప్రియులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.ఇపుడు ప్రభుత్వం నేరుగా దుకాణాలు…

ఆంధ్రప్రదేశ్‌లో దశల వారీ మద్య నిషేధం మాటెలా ఉన్నా మందుబాబులు మాత్రం విషాద సాగరంలో మునిగితేలుతున్నారు. గతంలో సిండికేట్ల చేతుల్లో మద్యం ఉన్నపుడు మద్యం ప్రియులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.ఇపుడు ప్రభుత్వం నేరుగా దుకాణాలు తెరవడంతో మరిన్ని సమస్యలు ఎదురైనట్టు వారు సెలవిస్తున్నారు.

రాష్ట్రంలో  మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలంటే దశలవారీగానే అది సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దశల వారీ సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా మద్యాన్ని ప్రభుత్వమే విక్రయించేందుకు ముందుకొచ్చింది. 

ఎక్సైజ్‌ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన బార్లు ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బార్ల లైసెన్స్‌లు రద్దు చేసి 2020 జనవరి 1వ తేదీ నుండి కొత్త బార్లు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

40 శాతం మేర బార్లను తగ్గిస్తూ దరఖాస్తు రుసుంను 10 లక్షలుగా ప్రకటించారు. ప్రైవేటు వ్యక్తులకు బార్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ లైసెన్స్‌ ఫీజును భారీగా పెంచింది. స్టార్‌ హోటల్‌లో బార్‌ నిర్వహించాలంటే 1.5 కోట్లు లైసెన్స్‌ ఫీజు నిర్ణయించారు.

మద్యం ధరలను సైతం భారీగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఎటుచూసినా మద్యంప్రియుల జేబులను గుల్ల చేసేదిగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీతో సంబంధం లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి. 

ఒక బాటిల్‌పై ముద్రించి ఉన్న ధర (కొత్త బ్రాండ్లు)తో సంబంధం లేకుండా అధిక మొత్తానికి విక్రయిస్తున్నారు. దీనిపై మద్యంబాబులు ప్రశ్నిస్తే బాటిల్‌పై ముద్రించింది పాత ధర కావడంతో కొత్త ధర ప్రకారం విక్రయిస్తున్నట్టు సమాధానం వస్తోంది.

ఒకవేళ అలా విక్రయించాల్సి వస్తే ఉన్న ధర స్థానే కొత్త ధరతో కూడిన స్టిక్కర్‌ను అతికించాల్సి ఉన్నా ఆ పని చేయకపోవడం మద్యంప్రియుల్లో అనుమానం లేవనెత్తుతోంది. అలాగే ప్రభుత్వ దుకాణాల నిర్వాహకులు విక్రయించిన సరుకుకు ఏ విధమైన బిల్లు ఇవ్వడం లేదని మందుబాబులు వాపోతున్నారు.

ప్రభుత్వ దుకాణాల్లో పరిస్థితిలా వుంటే బార్ల నిర్వాహకులు మరింతగా దోచుకుంటున్నట్టు తెలుస్తోంది. మద్యాన్ని అధిక ధరలకు విక్రయించడం ద్వారా మద్యంపై మందుబాబులకు మక్కువ లేకుండా చేయాలన్నది ప్రభుత్వ ఆశయమని శాఖల అధికారుల నుండి ఎక్సైజ్‌ శాఖ మంత్రి వరకూ చెబుతున్నారు.

ఇది కూడా మద్య నిషేధం అమల్లో భాగమని సెలవిస్తున్నారు. ఇదిలావుంటే మద్యం దుకాణాల్లో పనిచేసే కొందరు సిబ్బంది చేతివాటంతో బెల్ట్‌ షాపుల్లో లూజు సేల్స్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ఇటువంటి కేసులు వెలుగుచూశాయి. 

అక్రమార్కులపై కేసులు కూడా నమోదవుతున్నాయి. దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు అక్రమ మార్గంలో మద్యం బాటిళ్ళు తరలించి, బయట అధిక ధరలకు లూజ్‌సేల్స్‌ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే బార్లు, స్టార్‌ హోటళ్ళలో మద్యాన్ని నిర్దేశించిన ధర కంటే అధిక మొత్తానికి విక్రయించే అవకాశం ఉందని, అటువంటి వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

కొత్త ఎక్సైజ్‌ విధానం ప్రకారం అధిక మొత్తంలో సొమ్ములు చెల్లించే బార్లు పొందనున్న నేపథ్యంలో సదరు వ్యక్తులు అక్రమ వ్యాపారానికి గేట్లు తెరిచే అవకాశాలున్నట్టు జనం చెప్పుకుంటున్నారు.  ఇదే సమయంలో ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ పనితీరుపైనా తగు ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమని పలువురు హితవు పలుకుతున్నారు.

డి శ్రీనివాస్‌కృష్ణ