తెలుగుదేశం పార్టీ మరీ ఇంత నిస్సిగ్గుగా తయారైంది ఏంటి.. అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. రుణమాఫీ హామీ అమలు విషయంలో రైతుల ముందు జగన్ ను దోషిగా చూపించాలని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాల పట్ల అనేకమంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. జగన్ పాలనలో విమర్శించడానికి ఏమీదొరక్క తెలుగుదేశం పార్టీ ఇలాంటి చిల్లర ఎత్తుగడలు వేస్తూ ఉందనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.
రుణమాఫీ నాలుగు, ఐదో విడతలను జగన్ ప్రభుత్వం అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా ముందుకు వెళ్లిపోయారు. రుణమాఫీ హామీని అమలు చేయడంలేదు కాబట్టి.. జనాలు పన్నులు కట్టవద్దని ఆయన అంటున్నారు. ఇంటిపన్నులు కట్టవద్దు, ఆస్తి పన్నులు కట్టవద్దని ఆయన పిలుపును ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
తను ఎంత ప్రతిపక్షంలోకి వెళ్లిపోతే మాత్రం ఇలా పన్నులు కట్టవద్దని ఒక రాజకీయనేత పిలుపును ఇవ్వడం పూర్తిగా అసమంజసం. అయితే చంద్రబాబుకు ఇలాంటివి కొత్తకాదు. తను వస్తే రుణమాఫీ చేస్తానంటూ.. రైతులు ఎవరూ బ్యాంకులకు వడ్డీలు కూడా కట్టవద్దని గతంలో పిలుపునిచ్చారీయన. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రతి ఊరికీ వెళ్లి బ్యాంకుల లోన్లను చెల్లించవద్దని చెప్పేవారు.
తీరా అధికారంలోకి వచ్చాకా రుణమాఫీ విషయంలో సవాలక్ష కొర్రీలు వేశారు. ఐదు విడతలుగా మాఫీ అన్నారు. ఐదేళ్ల అధికారంలో మూడు విడతలు నామమాత్రపు చెల్లింపులు చేసి, రెండు విడతల మాఫీకి పంగనామాలు పెట్టారు. ఎన్నికల ముందేమో రుణమాఫీ అయిపోయిందన్నారు. ఇప్పుడేమో ఆ పని జగన్ చేయాలని అంటున్నారు. ఇలా నిస్సిగ్గువాదనలు చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలముందు మరింత పలుచన అవుతున్నారని పరిశీలకులు అంటున్నారు.