పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, దీదీ మమతా బెనర్జీ రాబోయే పరిణామాలను కొంతవరకు సరిగానే అంచనా వేయగలిగారని అనిపిస్తోంది. చిన్నరాష్ట్రాలు అనేవి భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్దాంతాల్లో ఒకభాగం. పైగా పశ్చిమ బెంగాల్ విభజనకోసం గూర్ఖాలాండ్ నుంచి డిమాండు చాలాకాలంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ను కూడా ఉరుములేని పిడుగులాగ రెండు ముక్కలుగా విభజించిన తరువాత.. రేపోమాపో పశ్చిమ బెంగాల్ విభజన కూడా జరగవచ్చునని మమతా దీదీ భయపడడంలో ఆశ్చర్యం అక్కర్లేదు.
మమతా బెనర్జీ చెన్నైలో జరిగిన కరుణానిధి తొలి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవాళ జమ్మూ కాశ్మీర్ కు వచ్చిన పరిస్థితే రేపు మనకు కూడా రావొచ్చు… అంటూ తమిళ ప్రజలను ఉద్దేశించి అన్నారు. అంటే ఆమె ఉద్దేశం పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను కూడా విభజించే పరిస్థితి వస్తుందని! దీదీ అంచనా కొంతవరకు కరక్టే. తమిళనాడు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. మోదీ ఈ అయిదేళ్ల ప్రభుత్వకాలం పూర్తయ్యేలోగా.. పశ్చిమబెంగాల్ నుంచి గూర్ఖాల్యాండ్ ను వేరు చేసే అవకాశం పుష్కలంగా ఉంది.
నిజానికి గూర్ఖాలాండ్ డిమాండ్ చాలాకాలంగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు దానినిన ఎప్పటికప్పుడు అణచివేస్తున్నాయి. ప్రత్యేకించి పశ్చిమబెంగాల్ విషయంలో రోహింగ్యాల సమస్యకు కూడా భాజపా పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తుంది. సిద్ధాంతాల పరంగా భాజపా చిన్న రాష్ట్రాలకు అనుకూలం. చిన్న రాష్ట్రాల ద్వారానే పరిపాలన సవ్యంగా ప్రజారంజకంగా సాగుతుందనేది వారి భావన. అయితే.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు ద్వారా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచి.. దేశం యావత్తు మీద కమలదళం గుత్తపెత్తనం చేయాలని కుట్ర చేస్తున్నదనేది విపక్షాల ఆరోపణ.
భాజపా మాత్రం.. ఏపీ విభజనకు కాంగ్రెస్ పూనుకున్నప్పుడు కూడా.. తమ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఆ బిల్లుకు మద్దతిచ్చింది. ఇవాళ కాశ్మీర్ నుంచి లడాఖ్ ను వేరు చేసింది. అలాగే గూర్ఖాలాండ్ ను ఏర్పాటుచేసినా ఆశ్చర్యం లేదు. తమిళనాడు జోలికి వెళుతుందో లేదో తెలియదు. ఎందుకంటే.. అక్కడ తమిళుల నుంచి రాష్ట్ర విభజన గురించిన డిమాండ్లు అంత ప్రబలంగా ఏమీలేవు. అందువల్లనే మమతా దీదీ అంచనా పాక్షికంగా కరక్టే అనుకోవాల్సి వస్తోంది. మరోసారి మోడీ పట్ల నిరసనలకు, ఉద్యమాలకు, పోరాటాలకు మమతా దీదీ ఎప్పటికి సిద్ధంగా ఉండాలో ఏమో?