ఏపీలో ఇప్పటివరకూ అన్ని జిల్లాల్లో ఒకేరకంగా ఆంక్షలు అమలవుతూ వచ్చాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు జూన్ 30తో ఆఖరు. తాజాగా ఇప్పుడు జులై1 నుంచి కొత్త సడలింపులను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ మాత్రం జిల్లాలను వేరు చేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొత్తగా సడలింపులు అమలులోకి రాబోతున్నాయి. జులై 1నుంచి ఈ ఎనిమిది జిల్లాల్లో సాయంత్రం 9 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలకు అనుమతిస్తారు.
రాత్రి 9నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తారు. వారం రోజులపాటు అంటే జులై-7 వరకు మాత్రమే ఇవి అమలులో ఉంటాయి. కరోనా పాజిటివిటి రేటు 5శాతం కంటే తక్కువగా ఉండటంతో వీటికి ఈ బంపర్ ఆఫర్ లభించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి..?
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉండటంతో.. ఆ జిల్లాలకు మాత్రం మినహాయింపు లేదు.
ఇక్కడ యధావిధిగా పాత నిబంధనలు అమలులో ఉంటాయి. జులై-7 వరకు ఉదయం 6గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ జిలాల్లో వ్యాపార కార్యకలాపాలకు, రోడ్లపై జనసంచారానికి అనుమతి ఉంది.
కర్ఫ్యూ సమయంలో ఆంక్షలు కఠినం..
సడలింపులు ఇస్తున్నా కూడా.. కర్ఫ్యూ సమయంలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని చెబుతున్నారు అధికారులు. కర్ఫ్యూ సమయంలో షాపులు మూసివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, మాస్క్ లు లేకుండా ఎవరైనా బయట కనిపిస్తే జరిమానా కట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.