జ‌ర్న‌లిస్టుల ఆవేద‌న‌పై ర‌ఘురామ లేఖాస్త్రం

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఏపీ జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ఏక‌రువు పెట్ట‌డం విశేషం. ఏపీలోని ప‌లు స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వానికి ర‌ఘురామ ‘నవ ప్రభుత్వ కర్తవ్యాల’…

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఏపీ జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ఏక‌రువు పెట్ట‌డం విశేషం. ఏపీలోని ప‌లు స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వానికి ర‌ఘురామ ‘నవ ప్రభుత్వ కర్తవ్యాల’ పేరుతో లేఖాస్త్రాల‌ను సంధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న త‌న తొమ్మిదో లేఖ‌లో ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.

‘మన మాటలను ప్రపంచానికి చెప్పే వారి మాటలను చెప్పడానికే’ అంటూ ఆక‌ట్టుకునే లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో జర్న లిస్టులకు రెండేళ్లుగా అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేయడం లేదని సీఎం జ‌గ‌న్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. అక్రిడిటేషన్‌ కమిటీలో ఒక్క జర్నలిస్టు లేరని.. ఒక్క సమావేశం జరుపుకోకుండానే కమిటీని రద్దు చేశారని పేర్కొన్నారు.

కమిటీ రద్దు కూడా పలు నాటకీయ పరిణామాల మధ్య జరిగిందన్నారు. ఒక నిర్ణయం తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిందని ఆయ‌న చెప్పారు. కొత్త నిబంధనలతో చాలా మంది అక్రిడిటేషన్‌ కార్డులు పొందలేకపోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అక్రిడిటేషన్‌ కోసం సుమారు 40వేల దరఖాస్తులు సమాచార శాఖ వద్ద ఎదురు చూస్తున్నాయ‌న్నారు. వీటిలో 17 వేల దరఖాస్తులు పరిశీలించి కేవ‌లం 470 కార్డులు మాత్ర‌మే జారీ చేశారని లేఖ‌లో గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు స్కీమ్‌ ఉండేద‌ని తెలిపారు. జర్నలిస్టులు రూ.1200 చెల్లిస్తే పటిష్ఠ ఆరోగ్య బీమా కల్పించేద‌ని పేర్కొన్నారు. కరోనాతో మరణించిన జర్నలిస్టులకు చెల్లింపులు జరగలేద‌ని ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే ఆరోగ్యశ్రీ కింద జర్నలిస్టులకు ఇప్పటి వరకు సాయం చేయలేదని తెలిపారు. జర్నలిస్టులకు రూ.50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాల‌ని, జర్నలిస్టులను, మీడియా సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్ జాబితాలో చేర్చాల‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు కోరారు. అక్రిడిటేషన్‌, ఆరోగ్యశ్రీ ఆరోగ్య కార్డుపై వెంట‌నే సానుకూల‌ నిర్ణయాలు తీసుకోవాల‌ని రఘురామ త‌న‌ లేఖలో కోర‌డం విశేషం. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి ర‌ఘురామ‌కృష్ణంరాజు తీసుకెళ్ల‌డంపై జ‌ర్న‌లిస్టులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత త‌మ‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌నే ఆవేద‌న‌, ఆక్రోశం జ‌ర్న‌లిస్టుల్లో బ‌లంగా ఉంది. కోర్టు కేసుల పేరుతో అక్రిడిటేష‌న్ల జారీలో కాల‌యాప‌న జ‌రుగుతోంది. నిజానికి మీడియా యాజ‌మాన్యాల‌పై కోపాన్ని జ‌ర్న‌లిస్టుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం చూపుతోంద‌ని, అందులో భాగంగానే అక్రిడిటేష‌న్లు ఇవ్వ‌లేద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. 

అర్హులైన వారికి కూడా అక్రిడిటేష‌న్లు ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వం వేదిస్తోంద‌నే భావ‌న జ‌ర్న‌లిస్టుల్లో ఉంది. జ‌ర్న‌లిస్టుల మ‌నోభావాల‌ను ర‌ఘురామ లేఖ ప్ర‌తిబింబించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.