కొత్త జిల్లాలు సరే …ముందు పేర్ల రచ్చ తీరాలి కదా

ప్రభుత్వం కొత్తగా ఏదైనా సంస్థ పెడితే, ఓ విద్యా సంస్థో లేదా విశ్వ విద్యాలయమో పెడితే, మండలాలు ఏర్పాటు చేస్తే, జిల్లాలు ఏర్పాటు చేస్తే ముందుగా రచ్చ జరిగేది పేర్ల మీదనే. ఏం పేరు…

ప్రభుత్వం కొత్తగా ఏదైనా సంస్థ పెడితే, ఓ విద్యా సంస్థో లేదా విశ్వ విద్యాలయమో పెడితే, మండలాలు ఏర్పాటు చేస్తే, జిల్లాలు ఏర్పాటు చేస్తే ముందుగా రచ్చ జరిగేది పేర్ల మీదనే. ఏం పేరు పెట్టాలి? ఏ సామాజిక వర్గం వారి పేరు పెట్టాలి? ఎవరి పేరు పెడితే ఎన్నికల్లో ఓట్లు పడతాయి? పేర్లు పెట్టే ముందు అధికార పార్టీకి అంటే ప్రభుత్వానికి ఇలాంటి లెక్కలు, సమీకరణాలు ఉంటాయి.

ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది ఇదే. గతంలో తెలంగాణలోనూ ఇదే జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది. జిల్లాల విభజనకు ప్రభుత్వాలు చెప్పే కారణం పరిపాలనను ప్రజల వద్దకు తీసుకుపోవడమని. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ప్రభుత్వాలు చెబుతుంటాయి. ఇది పైకి చెప్పే కారణమైనా కొత్త జిల్లాల ఏర్పాటుకు రాజకీయ కారణాలు ఉంటాయి. ఓట్లను దండుకునే వ్యూహం ఉంటుంది.

తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ చెప్పిన కారణం ఏమిటంటే  ఎన్ని ఎక్కువ జిల్లాలు ఉంటే కేంద్రం నుంచి అంత ఎక్కువగా నిధులు వస్తాయని. మరి కేసీఆర్ ఆలోచన వర్కవుట్ అయిందో లేదో తెలియదు. కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి కారణం అధికార పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడం కూడా. కొత్త జిల్లాల్లో పార్టీ పదవులు ఉంటాయి. ప్రభుత్వ పదవులు ఉంటాయి. అంటే కార్పొరేషన్లు గట్రా అన్న మాట. దీనివల్ల పార్టీలో అసంతృప్తి లేకుండా చూసుకోవచ్చు.

ఏపీలో జగన్ వ్యూహం కూడా ఇదే అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ పైకి చెప్పరు కదా. ఏదైతేనేం …కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి జగన్ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టాడు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె పైనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ సడన్ గా కొత్త జిల్లాల ఏర్పాటును తెర మీదికి తెచ్చాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఏ వాదనలు ఎలాగున్నా అనుకున్న పని చేయడం జగన్ కు అలవాటే కాబట్టి ఈ పని కూడా చేశాడనుకోవాలి.

కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడైతే తెర మీదికి వచ్చిందో అప్పటి నుంచే పేర్ల రచ్చ మొదలైంది. సరిహద్దుల వివాదాలు, ఒక జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని మరో జిల్లాలో కలపడం మొదలైన వివాదాలు కూడా ఉన్నాయనుకోండి. అది వేరే విషయం. కొత్త జిల్లాలకు ఫలానా పేర్లు పెట్టాలని, ఫలానా వారి పేర్లు పెట్టాలని, ఫలానా నాయకుల పేర్లు పెట్టాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కాపు రిజర్వేషన్ల ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కొత్త జిలాలకు ఏ పేర్లు పెట్టాలో ఓ జాబితా జగన్ కు పంపాడట.

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని జిల్లాలకు ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల పేర్లు జోడించి జిల్లాల పేర్లు పెట్టారు. ఉదాహరణకు …రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం… ఇలా అన్నమాట. దేవుడి పేరు లేదా పుణ్యక్షేత్రం పేరు జోడించి పెట్టడం సెంటిమెంటుకు సంబంధించిన వ్యవహారం. ఏపీలోనూ ఇలాగే జరుగుతుండొచ్చు.

ఇక గొప్ప వాళ్ళ పేర్లు, వివిధ సామాజిక వర్గాల్లో ప్రసిద్ధులైన వారి పేర్లు కూడా కొత్త జిల్లాలకు పెడతారు. ఇలాంటి వారిలో ఎక్కువమంది రాజకీయ నాయకులే ఉంటారు. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారు. ఈయన మొదటి నుంచి తెలంగాణా వాదాన్ని బలంగా వినిపించిన వ్యక్తి. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త కూడా. ఏపీలో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టాలని జగన్ నిర్ణయించారు.

జగన్ కు చంద్రబాబు అంటే ఒళ్ళు మంటగా ఉండొచ్చుగాని పెద్దాయన ఎన్టీఆర్ అంటే గౌరవం ఉండొచ్చు. కానీ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం చంద్రబాబును, టీడీపీని దెబ్బ తీయడమే. చంద్రబాబుకు ఆల్రెడీ మామను వెన్నుపోటు పొడిచాడనే పేరుంది. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు ఏపీకి మొదటి సీఎం అయినప్పటికీ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు. బాబు చేయలేని పని తాను చేశానని జగన్ ప్రచారం చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఇది బాబుకు ఇబ్బందికరమైన పరిస్థితే.

రోశయ్య సీఎం గా ఉన్నప్పుడు కడప జిల్లాకు వైఎస్సార్ పేరు జోడించారు. వైఎస్సార్ మరణించడంతో రోశయ్య ప్రభుత్వం ఈ పని చేసింది. ఇలా చెప్పుకుంటూ పొతే జిల్లాలకు పేర్లు పెట్టడం వెనుక అనేక కథలు ఉంటాయి. మరి ఏపీలో ఇలాంటి కథలు, వివాదాలు ఎన్ని వెలుగులోకి వస్తాయో చూడాలి.