ఎవరైనా గతిలేని వాళ్లు నాకు కాస్త సాయం చేయండి బాబూ అని బతిమాలుతారు. దేబిరిస్తారు. ఎవరొచ్చి తమకు సాయం చేస్తారా? అని ఎదురుచూస్తూ ఉంటారు! అయితే నన్ను స్ఫూర్తిగా తీసుకోండి, నన్ను చూసి నేర్చుకోండి.. అని బతిమాలే వారు ఎవరైనా ఉంటారా? తద్వారా.. నేను మహానుభావుడిని, నేను ఆదర్శపురుషుడిని అని ఇండైరక్టుగా ప్రొజెక్టు చేసుకునే వారు, తమకు తాము భజన చేసుకునే వారు ఎవరైనా ఉంటారా?
మామూలుగా అయితే మరీ అంత నేలబారుగా ఎవరుంటారని అనేస్తాం గానీ.. వివాదాస్పద రాజకీయ నాయకుడు ఆర్ఆర్ఆర్ ను చూస్తే మాత్రం ‘ఉంటారు’ అనే అనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం తెలుగు ప్రజలకు ఓ విజ్ఞప్తి పెట్టారు. ప్రజలందరూ తనను స్ఫూర్తిగా తీసుకోవాలని, తనను చూసి.. తన తరహాలో ప్రభుత్వం మీద పోరాడాలని ఆయన పిలుపు ఇచ్చారు.
అయితే సాధారణ ప్రజలకు కలుగుతున్న సందేహం ఒక్కటే.. తనలో ప్రజలంతా స్ఫూర్తిగా తీసుకోవాల్సినంత గొప్ప లక్షణాలు ఏమున్నాయని రఘురామక్రిష్ణ రాజు భ్రమపడుతున్నారా? అని!
రఘురామక్రిష్ణ రాజు తాను చెప్పుకుంటున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్నారో.. లేదా, తాను కక్షగట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి అవాకులు చెవాకులు పేలుతున్నారో అందరికీ తెలుసు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు పోరాడడం అంటే.. ఆయనలాగానే.. అవాకులు చివాకులు పేలడమేనా? అని కూడా సందేహించాల్సి వస్తుంది.
బ్యాంకురుణాలు తీసుకుని వందల కోట్ల రూపాయలు ఎగవేసిన కేసుల్లో నిందితుడు ఆర్ఆర్ఆర్. బ్యాంకులకు ఎగవేసిన వందల కోట్ల రూపాయలు మూలుగుతూ ఉంటాయి గనుక.. సుప్రీం కోర్టు న్యాయవాదులకు భారీగా ఫీజులు చెల్లించి.. ఆయన కేసులు నడిపిస్తూ ఉంటారు. మరి ఆయనను ప్రజలు ఎందులో ఆదర్శంగా తీసుకోవాలి.
వందల కోట్ల రూపాయలు ఎగవేయడంలోనా? లేదా, న్యాయవాదులకు భారీ ఫీజులు చెల్లించుకోవడంలోనా? ఆయనలాగా.. కోట్లరూపాయలు రుణాలు ఎగవేయడం రాష్ట్రప్రజలందరికీ సాధ్యమయ్యేపనేనా? తనలాగా ప్రజలందరూ పోరాడాలని అనుకుంటే.. తనలాగా బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి విలాసంగా బతకడం ఎలాగో ఆయన ప్రజలకు ముందు నేర్పాలని అందరూ అనుకుంటున్నారు.
వైసీపీ టికెట్ మీద గెలిచిన తర్వాత.. పార్టీతో సున్నం పెట్టుకుని.. ఇప్పటిదాకా తిరిగి తన నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టే ధైర్యంలేని నాయకుడు ఆర్ఆర్ఆర్. అలా తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజల నుంచి దూరంగా పారిపోవడం ఎలాగో.. వారిని పట్టించుకోకుండా పారిపోయి.. మళ్లీ ఓట్లకోసం దేబిరించడం ఎలాగో ఆయన నుంచి ప్రజలు స్ఫూర్తిపొందాలా అనే ప్రశ్న పలువురిలో ఉదయిస్తోంది.
రఘురామక్రిష్ణ రాజు.. ప్రజలు అమాయకులు అని భ్రమపడుతూ.. ఎలాంటి మాటలు, కాకమ్మ కబుర్లు చెప్పినా నడుస్తుంది గానీ.. ప్రజలందరూ తనను స్ఫూర్తిగా తీసుకోవాలని అనడమే.. కొంచెం కామెడీగా ఉన్నదని అందరూ నవ్వుకుంటున్నారు.