ఆస్పత్రుల స్థాయి పెరిగే కొద్దీ ఎంపీ రఘురామకృష్ణంరాజులో కొత్త సమస్యలు బయటపడుతున్నాయి. గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రి వైద్య నివేదికలో గుర్తించని అనారోగ్య సమస్యలు, సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత బయటపడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతానికి వస్తే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లిన తర్వాత మరో కొత్త సమస్యను వైద్యులు కనుగొన్నారు. ఆయన పాదాల్లో సెల్ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యులు గుర్తించడం విశేషం.
సికింద్రాబాద్ సైనికాస్పత్రిలో కాలి గాయాలు తగ్గక పోవడం, నొప్పి విపరీతంగా ఉండడం, బీపీ కంట్రోల్ కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బుధవారం ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఈ సందర్భంగా రఘురామకు సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్‌తో పాటు ఇతరత్రా వైద్య పరీక్షలను ఎయిమ్స్ వైద్య బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా కాళ్లలో సెల్ డ్యామేజ్ బాగా జరిగినట్టు బయట పడింది.
దీంతో ఆయన రెండు కాళ్లకు వైద్యులు ఎముకలు పీవోపీ కట్టు కట్టారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ నడవడానికి వీల్లేదని వైద్యులు సూచించారు. రెండు వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని రఘురామకు సూచించారు.
పరీక్షల అనంతరం ఎయిమ్స్ నుంచి అధికారిక నివాసానికి రఘురామకృష్ణరాజు చేరుకున్నారు. ఒక వైపు సుప్రీంకోర్టు కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతులతో నోరు మూయిస్తే, ఎయిమ్స్ వైద్యులు అసలు నడచొద్దని గట్టిగా చెప్పడం గమనార్హం.
ఏపీ సీఐడీ పోలీసులు మళ్లీ విచారణ మొదలు పెట్టాలంటే రఘురామ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. అప్పటి వరకూ రఘురా మకు వైద్యం అందుతూనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.