ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి మరుసటి రోజు నుంచే తిరిగి గెలవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఎక్కడ ఓడిపోయామో అక్కడే తన క్యాడర్ మరింత పెంచుకోవాలని తహతహలాడతాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండేందుకు, ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆశ్చర్యంగా నారా లోకేష్ మాత్రం ఈ విషయాన్ని బాగా లైట్ తీసుకున్నారు. మంగళగిరిలో ఓడిపోయిన టీడీపీ భావి అధ్యక్షుడు.. మళ్లీ ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషమే.
అప్పటి వరకూ ఎమ్మెల్సీగా మంత్రి పదవి వెలగబెట్టిన నారా లోకేష్ కోసం 2019 ఎన్నికల్లో అర్జంట్ గా ఓ అసెంబ్లీ నియోజకవర్గం కావాల్సి వచ్చింది. రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉంటే.. చినబాబు భవిష్యత్ బాగుంటుందని మంగళగిరిని సెలక్ట్ చేసుకున్నారు. మంగళగిరిపై ఆశలు పెట్టుకున్న కాండ్రు కమలకి చంద్రబాబు చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆమె వైసీపీ కండువా కప్పుకున్నారు.
గంజి చిరంజీవి మాత్రం చంద్రబాబు మాట కాదనలేక లోకేష్ కోసం మనసు చంపుకుని ప్రచారం చేశారు. అప్పటివరకూ మంగళగిరిపై ఆశలు పెట్టుకున్నవారంతా లోకేష్ రాకతో అలా ఇబ్బంది పడ్డారు. తీరా ఇప్పుడు లోకేష్ ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో వారంతా మరోసారి టెన్షన్లో పడ్డారు.
రెండేళ్లవుతున్నా మంగళగిరిలో టీడీపీ కేడర్ కి, లీడర్స్ కి దిశా నిర్దేశం చేసే నాయకుడు లేరు. ఒకవేళ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకుంటే చివరి నిముషంలో లోకేష్ వచ్చి ఆ సీటు తన్నుకుపోతారనే భయం కూడా వారిలో ఉంది. దీంతో మంగళగిరి టీడీపీ దిక్కులేని దివాణంలా మారింది.
మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత వెంటనే ట్విట్టర్ లో దూరిపోయారు నారా లోకేష్. తాను రాష్ట్రస్థాయి నాయకుడ్ని, పార్టీ అధ్యక్షుడ్ని అనే ఫీలింగ్ తోనే రాజకీయాలు చేస్తున్నారు తప్ప, ముందు ఎమ్మెల్యేగా గెలవాలి, దాని కోసం కృషి చేయాలనే స్పృహ లోకేష్ లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఆయన కోసం ప్రచారం చేసి, డబ్బులు పంపిణీ చేసిన నేతలు.. వచ్చే ఎన్నికల నాటికి కనిపించకపోవచ్చు.
ఇలాంటి టైమ్ లో లోకేష్ తనకంటూ ఓ బేస్ ఏర్పాటుచేసుకోవాలి. నిజంగానే మరోసారి మంగళగిరిలో ఆయన పోటీ చేయాలనుకుంటే, ఇప్పట్నుంచే ఆ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలి. అప్పుడప్పుడూ పర్యటనలు పెట్టుకోవాలి. కానీ లోకేష్ కి అవేమీ పట్టడంలేదు. అసలు ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు.
వచ్చే ఎన్నికల నాటికి తండ్రి చంద్రబాబు.. తనను ఏదో ఒక నియోజకవర్గంలో నిలబెట్టి, ఆయనే తనను దగ్గరుండి గెలిపిస్తారనే భ్రమలో చినబాబు ఇంకా ఉన్నట్టుున్నారు. తాను ఓడిపోయినా పార్టీ గెలిస్తే, సునాయాసంగా ఎమ్మెల్సీ అయిపోయి మరోసారి దొడ్డిదారిన మంత్రి అయిపోవచ్చని లోకేష్ కలలుకంటున్నారు. టీడీపీ అధ్యక్షుడిగా ఎదగాలనుకుంటున్న వ్యక్తికి ఇలాంటి ఆలోచన విధానం సరికాదు.
స్థానిక ఎన్నికల్లో కుప్పం కూసాలు కదిలిపోయే సరికి చంద్రబాబే టెన్షన్ పడ్డారు. అలాంటి చంద్రబాబు.. కొడుకుని గెలిపిస్తారనుకుంటే అది చినబాబు భ్రమే అనుకోవాలి. ఆ భ్రమల్లో నుంచి ఇప్పుడాయన ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. బహుశా ఇలా కోరుకోవడం కూడా అత్యాశ అవుతుందేమో.