వర్క్ ఫ్రం హోమ్.. ఇది మరో ఆన్ లైన్ మోసం

“ఇంట్లోనే కూర్చొని వేల రూపాయలు సంపాదించండి. కేవలం 2 గంటలు కష్టపడి నెలకు 50వేలు సంపాదించండి. యాడ్స్ పై క్లిక్ చేయండి, లక్ష రూపాయలు సంపాదించండి.” ఇలాంటి ఎన్నో యాడ్స్ మనకు సోషల్ మీడియాలో…

“ఇంట్లోనే కూర్చొని వేల రూపాయలు సంపాదించండి. కేవలం 2 గంటలు కష్టపడి నెలకు 50వేలు సంపాదించండి. యాడ్స్ పై క్లిక్ చేయండి, లక్ష రూపాయలు సంపాదించండి.” ఇలాంటి ఎన్నో యాడ్స్ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. 

వీటికితోడు ఇప్పుడు మొబైల్స్ కు కూడా ఈ తరహా మెసేజీలు ఈమధ్య ఎక్కువగా వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఊరించే ఇలాంటి యాడ్స్ పై అప్రమత్తంగా వ్యవహరించాలి. లేదంటే మోసపోవడం గ్యారెంటీ.

రీసెంట్ గా ఓ మై గాడ్ (ఓఎంజీ) అనే యాప్ వచ్చింది. వీళ్లు ఇచ్చే యాడ్స్ ను క్లిక్ చేస్తే చాలు. ప్రతి క్లిక్ కు కొన్ని పాయింట్స్ జమ చేస్తారు. వారం తర్వాత ఆ పాయింట్ల ఆధారంగా లెక్కకట్టి డబ్బు జమచేస్తారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే అసలైన మెలిక ఉంది.

ఇందులో చేరాలంటే ముందుగా మీరు డిపాజిట్ కట్టాలి. ఆ తర్వాత వారానికి ఇంత అంటూ కొంత డబ్బు ఇస్తారు. కొన్నాళ్లకు బోర్డు తిప్పేస్తారు. ఇలానే డిపాజిట్ల పేరిట లక్షలు కొల్లగొట్టి, నామమాత్రంగా బాధితులకు డబ్బులిచ్చి మోసం చేసింది ఓఎంజీ యాప్. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఈ యాప్ పై ఇప్పటివరకు 15కు పైగా కేసులు నమోదయ్యాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ లో జాగ్రత్తలేంటి..

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఈమధ్య కాలంలో ఇలాంటి యాప్స్, సైట్స్ లెక్కలేనన్ని పుట్టుకొస్తున్నాయి. మోసపోతున్న వాళ్లు కూడా వేలల్లో ఉంటున్నారు. కాకపోతే బయటకొస్తున్న ఘటనలు మాత్రం అత్యల్పంగా ఉంటున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొగ్రామ్ కు సంబంధించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వీటిలో అత్యంత కీలకమైన అంశం ఒకే ఒక్కటి.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసే సంస్థలేవీ కాషన్ డిపాజిట్, అడ్వాన్స్, గుడ్ విల్ పేరిట డబ్బు డిమాండ్ చేయవు. ఏ సంస్థ అయినా అలా డబ్బు అడిగిందంటే అది నకిలీ అని తెలుసుకోవాలి. నిజమైన ఆన్ లైన్ సంస్థలు మనతో పని చేయించుకుంటాయి. పని పూర్తయిన తర్వాత చేసిన పనికి డబ్బులు లెక్కకట్టి ఇస్తాయి. ఈ కార్యక్రమంలో ఏ దశలోనూ ఉద్యోగి/వ్యక్తి నుంచి డబ్బు కోరదు.

కేవలం నగదు మాత్రమే కాదు.. వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ ను నిజాయితీగా నడిపే సంస్థలు క్రెడిట్ కార్డు డీటెయిల్స్ కూడా డిమాండ్ చేయవు. ఒకవేళ ఏదైనా సంస్థ మీ క్రెడిట్ కార్డు నంబర్ లేదా సీవీవీ నంబర్ లేదా మీ పుట్టిన తేదీ లాంటి వివరాలు అడిగితే అది నకిలీ సంస్థ అనే విషయాన్ని గ్రహించాలి. 

ఒక్కోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించి కొన్ని లింక్స్ వస్తుంటాయి. వాటిని క్లిక్ చేస్తే డబ్బులొస్తాయని చెబుతారు. కానీ అలా క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్ లేదా కంప్యూటర్ లో ఉన్న వ్యక్తిగత సమాచారం సదరు యాప్ కు చేరిపోతుంది. ఇలాంటి లింక్స్ విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. డబ్బులు అడగడం లేదు కదా అని ఇలాంటి అవాంఛిత లింక్స్ పై క్లిక్ చేసినా ప్రమాదమే. 

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం