దా’రుణ’ యాప్స్ పై దృష్టి పెట్టిన గూగుల్

తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రాణాలు తీసిన ఆన్ లైన్ లోన్ యాప్స్ పై ఎట్టకేలకు గూగుల్ దృష్టిపెట్టింది. హైదరాబాద్ పోలీసులతో పాటు ఆర్బీఐ నుంచి వచ్చిన సూచనల ఆధారంగా గూగుల్, తమ ప్లే-స్టోర్ లో…

తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రాణాలు తీసిన ఆన్ లైన్ లోన్ యాప్స్ పై ఎట్టకేలకు గూగుల్ దృష్టిపెట్టింది. హైదరాబాద్ పోలీసులతో పాటు ఆర్బీఐ నుంచి వచ్చిన సూచనల ఆధారంగా గూగుల్, తమ ప్లే-స్టోర్ లో ఉన్న యాప్స్ పై ఆడిట్ నిర్వహించింది. 

ఈ క్రమంలో వందల సంఖ్యలో ఉన్న అక్రమ లోన్ యాప్స్ ను నిషేధించింది. గడిచిన 2 వారాల్లో ఇలా 200కు పైగా లోన్ యాప్స్ ను తొలిగించినట్టు తెలుస్తోంది.

అయితే ఇక్కడితో కథ ముగియలేదు. గూగుల్ తొలిగించాల్సిన జాబితాలో ఇంకా 450కు పైగా లోన్ యాప్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 110 యాప్స్ ఉన్నాయి. అటు రాచకొండ పరిధిలో మరో 90  యాప్స్ ఉన్నాయి. వీటిని కూడా తొలిగించాల్సిందిగా అటు గూగుల్ కు, ఇటు ఆర్బీఐకి పోలీసులు లేఖలు రాశారు. మరో వారం రోజుల్లో ఈ యాప్స్ పై కూడా చర్యలు తప్పవు.

అక్రమ లోన్ యాప్స్ పై ఇప్పటికే పోలీసులు గట్టిగా దృష్టిపెట్టారు. వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. 3 కమిషనరేట్ల పరిథిలో వివిధ ఎకౌంట్లలో ఉన్న 450 కోట్ల రూపాయల డబ్బును ఫ్రీజ్ చేశారు. అలాగే నలుగురు చైనా దేశస్తుల్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఆన్ లైన్ రుణం అంటూ అవసరం ఉన్నా లేకున్నా బాధితుల ఎకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాయి కొన్ని యాప్స్. వీటికి అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఒక్కోసారి తీసుకున్న డబ్బు కంటే కట్టాల్సిన వడ్డీనే చాలా ఎక్కువగా ఉంటోంది. 

గడువు లోగా చెల్లించకపోతే బాధితుడి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్లందరికీ సదరు బాధితుడు డీఫాల్డర్ అంటూ మెసేజీలు పంపిస్తోంది. ఇలా అవమానభారాన్ని భరించలేక తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పుడు ఆన్ లైన్ యాప్స్ పై గట్టిగా దృష్టిపెట్టారు. ఎలాంటి ష్యూరిటీ లేకుండా డబ్బులు ఎకౌంట్లలో వేస్తామంటూ వచ్చే మెసేజీలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరోవైపు ఆర్బీఐ కూడా దీనిపై విస్పష్టంగా కొన్ని సూచనలు చేసింది. ఆన్ లైన్ లో రుణాలిచ్చే సంస్థ ఏదైనా.. ఆర్బీఐ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీచేసింది.

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే