ఇంతలోనే ఎంత తేడా.. చంద్రబాబు నాయుడు ఏం చెబితే అది చేసిందామె! రాయలసీమ నేతల్లో అమరావతి గురించి మాట్లాడిన తెలుగుదేశం నేతలు కూడా తక్కువ. అమరావతిని అతిగా సమర్థిస్తే తమ సొంత ప్రాంతంలో వ్యతిరేకత ప్రబలుతుందనే భావనతో చాలా మంది తెలుగుదేశం నేతలు కూడా అమరావతి విషయంలో స్పందించలేదు.
అక్కడ భూములు కలిగిన కొందరు కమ్మ -తెలుగుదేశం నేతలు మాత్రం వీర లెవల్లో స్పందించారు. అమరావతి కోసం వారు కన్నీరు పెట్టుకున్నారు. అయితే హైదరాబాద్- రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ ఆస్తులను కలిగిన భూమా అఖిలప్రియ మాత్రం అమరావతి కోసం గళం విప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అఖిలప్రియ అమరావతి కోసం మాట్లాడి ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు.
ఇప్పుడే కాదు… భూమా కుటుంబం చంద్రబాబు నాయుడి రాజకీయానికి ఆది నుంచి ఉపయోగపడుతూనే ఉంది. మధ్యలో ఐదారేళ్లు మాత్రం వారు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. మొదట ప్రజారాజ్యంలో చేరారు, ఆ తర్వాత నాలుగేళ్ల పాటు జగన్ వెంట నడిచారు.
శోభా నాగిరెడ్డి మరణంతో భూమా కుటుంబ రాజకీయ ప్రస్థానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చేసుకుంటే తెలుగుదేశం పార్టీ బలోపేతం అయిపోతుందునే లెక్కలతో చంద్రబాబు నాయుడు అనేక మంది ఎమ్మెల్యేలను నయానోభయానో చేర్చుకున్నారు. అలా చేరిన వారిలో భూమా నాగిరెడ్డి కూడా ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదు.
ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రకరకాల కేసులు పెట్టి వేధించారు. తనను టచ్ చేయవద్దని ఒక పోలీసాఫీసర్ ను హెచ్చరించినందుకు కూడా భూమా నాగిరెడ్డి అప్పట్లో ఎస్సీ అట్రాసిటీ కేసును ఎదుర్కొనాల్సి వచ్చిందంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఆయనను ఎలా ట్రీట్ చేసిందో వివరించనక్కర్లేదు.
ఆ వేధింపులన్నీ భరించలేక భూమా నాగిరెడ్డి తెలుగుదేశం వైపు వెళ్లారనేది కూడా బహిరంగ సత్యం. తీరా చేర్చుకున్నాకా కూడా నాగిరెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా ఉండనీయలేదు అనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది.
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాల్సిందే అని, అక్కడ బలం టీడీపీకి లేకపోయినా తను చెప్పిన వ్యక్తిని గెలిపించాల్సిందే అంటూ భూమా నాగిరెడ్డి పై చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
బలాల లెక్కల గురించి భూమా వివరించి చెప్పినా చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి భూమాను మరింత ఇబ్బంది పెట్టాడని వార్తలు వచ్చాయి. అప్పటికే హార్ట్ పేషెంట్ అయిన భూమా నాగిరెడ్డి ని అటు వైరి పక్షంలో ఉన్నప్పుడు, ఇటు తన వైపుకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన చిత్రవధ అంతా ఇంతా కాదంటారు. ఆ పరిస్థితుల్లో ఆయన గుండెపోటుకు గురై మరణించారు.
ఆ తర్వాత సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు ఆయన కూతురు అఖిలకు మంత్రి పదవి ఇచ్చారు. నంద్యాల బై పోల్ లో ఎలాగో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. అయితే అప్పుడు వచ్చిన మెజారిటీ రెండేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ దక్కడం కాదు కదా, అప్పుడు వచ్చిన మెజారిటీతో పోలిస్తే.. చిత్తు చిత్తుగా టీడీపీ అభ్యర్థి నంద్యాల్లో చిత్తయ్యారు.
ఈ క్రమంలో ఎన్నికల తర్వాత భూమా రాజకీయ ప్రస్థానం ఢీలా పడింది. ఈ పరిస్థితుల్లో ఆస్తుల గొడవలు, కిడ్నాపింగ్ వ్యవహారంలో భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ఆమె జైలు పాలయ్యారు. అయితే ఆమె విషయంలో చంద్రబాబు నాయుడు కానీ, ఆయన తనయుడు లోకేష్ కానీ ఇప్పటి వరకూ కిక్కురుమనలేదు.
అరెస్టైంది తమ పార్టీ నేత, మాజీ మంత్రి, మొన్నటి వరకూ తమ కోసం నోరేసుకుని పోరాడిన వ్యక్తి అని మినిమం కృతజ్ఞతను కూడా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు కనబరచడం లేదు. అలాగే తాము స్పందించకపోయినా.. వారు టీడీపీ నేతలకు స్పందించమని చెప్పినట్టుగా కూడా వాతావరణం కనిపించడం లేదు.
ఈ క్రమంలో..ఇంతకీ తెలుగుదేశం పార్టీలో అఖిలప్రియ రాజకీయభవితవ్యం ఏమిటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆమె అరెస్టై జైలు పాలయినా తెలుగుదేశం నామమాత్రంగా కూడా స్పందించలేదు. అస్సలు తమకేం తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ నేతలు. ఆమె తమ మాజీ మంత్రి కాదు, ప్రస్తుత తమ పార్టీ నాయకురాలు కాదన్నట్టుగా వారు స్పందిస్తున్నారు.
అమరావతి కోసం అఖిలప్రియ స్పందన అవసరం అయ్యింది, అఖిలప్రియ కోసం మాత్రం టీడీపీ స్పందించడం లేదు. ఇదీ చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం అనే విషయం మరోసారి స్పష్టం అవుతోంది. రేపు అఖిలప్రియ ఈ కేసు తలనొప్పి నుంచి బయటకు వచ్చాకా అయినా టీడీపీ ఆమెను పట్టించుకుంటుందా? అంటే అప్పటి అవసరాన్ని బట్టి స్పందిస్తుందనేది వేరే చెప్పనక్కర్లేదు.
అఖిలప్రియతో రాజకీయంగా అవసరం ఉందనుకుంటే.. చంద్రబాబు నాయుడు ఆమెకు ముందు ముందు అయినా ప్రాధాన్యతను ఇస్తారు. అలా కాదనుకుంటే.. ఆయన తీసేసిన ఎన్నో కరివేపాకుల లిస్టులో అఖిలప్రియ ఒకరవుతారని వేరే చెప్పనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.