భూమా బ్ర‌హ్మానంద రెడ్డి ఎక్క‌డ‌?!

తెలుగు రాజ‌కీయాల‌కు అనూహ్య‌మైన ప‌రిస్థితుల్లో ప‌రిచ‌యం అయిన వ్య‌క్తి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి. భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో క‌ర్నూల జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన బై పోల్ లో పోటీ చేశాడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి.…

తెలుగు రాజ‌కీయాల‌కు అనూహ్య‌మైన ప‌రిస్థితుల్లో ప‌రిచ‌యం అయిన వ్య‌క్తి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి. భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో క‌ర్నూల జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన బై పోల్ లో పోటీ చేశాడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి. భూమా నాగిరెడ్డి సోద‌రుడి కుమారుడుగా రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చారీయ‌న‌. 

పెద్ద వాగ్ధాటి లేక‌పోయినా, రాజ‌కీయాల‌కు చాలా కొత్త అయిన‌ప్ప‌టికీ.. బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి ప్ర‌జ‌ల ఆమోదం పొందారు. తెలుగుదేశం పార్టీ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పోరాడి నంద్యాల బై పోల్ లో నెగ్గ‌గలిగింది. ఆ బై పోల్ ప్ర‌చారంలో.. భూమా పిల్ల‌లంతా ఒకే బండెక్కి ప్ర‌చారం చేసుకున్నారు.

అఖిల‌ప్రియ‌, మౌనిక‌, జ‌గ‌త్ విఖ్యాత్.. వీళ్లంతా బ్ర‌హ్మానంద‌రెడ్డి త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. సానుభూతిని ఆశిస్తూ, ఎన్నిక‌ల్లో త‌మ సోద‌రుడిని గెలిపించ‌మ‌ని కోరారు. ప్ర‌చార హోరులో అనేక సార్లు క‌న్నీళ్లు పెట్టుకుంటూ క‌నిపించారు. సానుభూతి వ‌ర్షించింది. 

బ్ర‌హ్మానంద‌రెడ్డి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత నంద్యాల్లో పెండింగ్ అభివృద్ధి ప‌నులు ఏం పూర్తి చేశారో కానీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మానంద‌రెడ్డికే మ‌ళ్లీ నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ టికెట్ ద‌క్కింది. అయితే తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్ల‌లోనే వ‌చ్చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మానంద‌రెడ్డి గెలిచి నిల‌వ‌లేక‌పోయారు. ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయారు. శిల్పా కుటుంబం చేతిలో భూమా కుటుంబం అభ్య‌ర్థి నంద్యాల్లో చిత్త‌య్యారు.

ఇక ఆ త‌ర్వాత కూడా తెలుగుదేశం పార్టీలోనే కొన‌సాగాడు బ్ర‌హ్మానంద‌రెడ్డి. త‌న బంధువులు, త‌నకు పిల్ల‌నిచ్చిన మామ‌తో స‌హా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అటు వైపు వెళ్ల‌లేదు. తెలుగుదేశం పార్టీ త‌ర‌పునే నంద్యాల్లో ప‌ని చేసుకుంటూ వ‌చ్చారు. 

ఇక కిడ్నాపింగ్ కేసులో అఖిల అరెస్టు, భూమా కుటుంబ స‌భ్యుల‌పై ఆరోప‌ణ‌లు, కేసుల నేప‌థ్యంలో.. ఈ మొత్తం ఎపిసోడ్లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పేరు వినిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అటు నిందితుల జాబితాలో కానీ, ఇటు స్పందిస్తున్న వారి జాబితాలో కానీ భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి లేరు.

తెలుగుదేశం పార్టీ నేత‌గా కానీ, తెలుగుదేశంలోనే ఉన్న భూమా కుటుంబ స‌భ్యుడిగా కానీ.. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి స్పందించ‌లేదు. ఆయ‌న గెలుపు కోసం అఖిల‌, మౌనిక లు బాగా ప‌ని చేశారు. దానికి వారు అఖిల‌కు మంత్రి ప‌దవి రూపంలో ప్ర‌యోజ‌నం పొందారు. అయితే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇటూ,ఇటూ భూమా కుటుంబ స‌భ్యులు చాలా మంది అఖిల‌కు దూరం అవుతూ వ‌చ్చార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

ఏవీ సుబ్బారెడ్డితో మొద‌లుకుని భూమా అనుచ‌ర‌వ‌ర్గం, ఇటు బంధువ‌ర్గం దూరం అయ్యిందంటారు. భూమా నాగిరెడ్డి సోద‌రుడి కుమారుల్లో ఒక‌రైన భూమా కిషోర్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. అంతే కాదు.. బ్ర‌హ్మానంద‌రెడ్డి సోద‌రుడు మ‌హేష్ కూడా బీజేపీలోనే చేరార‌ట‌. బ్ర‌హ్మానంద‌రెడ్డి మాత్రం పేరుకు తెలుగుదేశంలో మిగిలారు. 

అఖిల‌ప్రియ అరెస్టు వ్య‌వ‌హారంలో ఆయ‌న అస్సలు స్పందించ‌క‌పోవ‌డంతో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆయ‌న స్పందించ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించి.. ఆయ‌న‌కు కూడా సోద‌రి అఖిల‌తో పూర్తిగా దూరం పెరిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. పేరుకు టీడీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. అఖిల‌ప్రియ‌తో బ్ర‌హ్మానంద‌రెడ్డి బాంధ‌వ్యం కూడా అంతంత మాత్ర‌మే అనే మాట వినిపిస్తోంది.

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే