వైఎస్ జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఓ తప్పును సరిదిద్దుకుంది. జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన అంశం ఏదైనా ఉందా? అంటే …అది ఇసుక పాలసీ అని చెప్పక తప్పదు. చంద్రబాబు హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలను అరికట్టి, మెరుగైన విధానం తీసుకొస్తామంటూ జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే మెరుగైన పాలసీ తీసుకురావడం దేవుడెరుగు … అసలుకే ఇసుక కరువైన దుస్థితి. దీంతో భవన నిర్మాణ కార్మికులు, ఇతరత్రా నిర్మాణాలు చేపట్టిన వారికి ఇసుక కొరత చుక్కలు చూపించింది.
మరీ ముఖ్యంగా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవాలని జగన్ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ విధానంలో సామాన్యులకు ఇసుక అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో నూతన ఇసుక పాలసీ జగన్ ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ గురించి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరాలు వెల్లడించారు. మంత్రి వర్గ ఉప సంఘం సిఫార్సులు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని పాలసీలో మార్పులు చేసి తాజాగా నూతన ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టామని ఆయన చెప్పారు.
ఈ కొత్త పాలసీ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండానే వినియోగదారులు నేరుగా ఇసుక రీచ్ వద్దకెళ్లి సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లొచ్చన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రతి రీచ్ దగ్గర టన్ను ఇసుక రూ.475 చొప్పున ఖరారు చేశామన్నారు. దీనికి అదనంగా రవాణా ఛార్జీలు ఉంటాయన్నారు.
అన్ని రీచ్‌ల్లోనూ ఒకే ధర అమలు చేస్తున్నామని, ప్రతి ఇసుక రీచ్ వద్ద 20 వాహనాలు ఏర్పాటు చేసిట్లు ఆయన చెప్పారు. నాణ్యతను పరిశీలించి తమకు నచ్చినచోట ఇసుక తీసుకెళ్లే సౌకర్యం కల్పించామన్నారు. నూతన ఇసుక పాలసీతోనైనా ప్రజలకు ఇసుక కష్టాలు తప్పుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవడాన్ని తీసేయడం వల్ల బ్లాక్‌మార్కెట్‌కు ఇసుక తరలింపునకు అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు.