నిమ్మగడ్డ: పచ్చ పత్రికల పాన్ ఇండియా హీరో

టీడీపీ అనుకూల మీడియాలో నిమ్మగడ్డపై పడుతున్న వరుస కథనాలు చూస్తుంటే ఆయన్ని అమాంతంగా పాన్ ఇండియా లెవల్లో హీరోని చేసినట్టు అర్థమవుతోంది. నిమ్మగడ్డ సొంత ఊరికి వెళ్లారు, ఆయన తల్లిని అభిమానంగా చూసుకుంటారు, చిన్ననాటి…

టీడీపీ అనుకూల మీడియాలో నిమ్మగడ్డపై పడుతున్న వరుస కథనాలు చూస్తుంటే ఆయన్ని అమాంతంగా పాన్ ఇండియా లెవల్లో హీరోని చేసినట్టు అర్థమవుతోంది. నిమ్మగడ్డ సొంత ఊరికి వెళ్లారు, ఆయన తల్లిని అభిమానంగా చూసుకుంటారు, చిన్ననాటి స్నేహితుల్ని ఆప్యాయంగా పలకరించారు అంటూ ఓ పత్రిక ఆకాశానికి ఎత్తేసింది.

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో నిమ్మగడ్డ మానవత్వం చాటుకున్నారు, దివ్యాంగుడి కష్టాలు విని అర్జీ తీసుకున్నారు, కలెక్టర్ గా పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారంటూ మరో పత్రిక ఇంకాస్త ఓవర్ చేసింది.

ఇంతకీ ఆ రెండు పత్రికలు, సదరు టీడీపీ అనుకూల మీడియా ఛానెళ్లు ఏం చెప్పాలనుకుంటున్నాయి. చంద్రబాబుకి సైతం ప్రయారిటీ తగ్గించి ఫ్రంట్ పేజీలో పెద్ద నిమ్మగడ్డ  బొమ్మ వేస్తున్నారంటే అర్థం ఏంటి? అవసరం ఉన్న లేకపోయినా, ఆయన మీడియా సమావేశాలను లైవ్ లో ఇస్తూ, పదే పదే పంచ్ డైలాగులంటూ ఆయన మాటల్ని టెలికాస్ట్ చేస్తూ.. ప్రభుత్వానికి షాకిచ్చారు, సినిమా చూపిస్తున్నారంటూ నిమ్మగడ్డని హైలెట్ చేసుకుంటూ పోతున్నారు.

మహా అయితే గట్టిగా నెల రోజుల్లో పంచాయతీ నాలుగు దశలు పూర్తయిపోయి రిజల్స్ట్ వచ్చేస్తాయి. ఆ తర్వాత యథావిధిగా నిమ్మగడ్డను ఈ మీడియా పక్కనపెట్టడం ఖాయం. సో.. పంచాయతీ ఎన్నికలయ్యాక,  నిమ్మగడ్డ పదవి నామమాత్రమే.

అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ, ఇప్పుడు నిమ్మగడ్డ..

ఈపాటికే వైసీపీ నాయకులు ఈ పోలికను తెరపైకి తెచ్చారు కూడా. జగన్ ఆస్తుల కేసుల విచారణ సమయంలో జేడీ లక్ష్మీనారాయణని హీరోగా మార్చేసింది పచ్చపాత మీడియా. ఆయన ఎవరు, ఎక్కడినుంచి వచ్చారు, ఆయన ఇష్టాయిష్టాలేంటి అంటూ పర్సనల్ ఇంటర్వ్యూలతో పేపర్లు నింపేశాయి. ఆ తర్వాత ఇప్పుడు జేడీ గురించి పట్టించుకునేవారే లేరు. ఆ ఊపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి మరింత పలుచన అయ్యారు.

ఇప్పుడు పచ్చపాత మీడియాతో పాన్ ఇండియా హీరో లెవల్లో పబ్లిసిటీ తెచ్చుకుంటున్న నిమ్మగడ్డ వ్యవహారం కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఇప్పుడు వస్తున్న ప్రచారంతో నిమ్మగడ్డ తనని తాను హీరోగా ఊహించుకుంటున్నారు. ప్రెస్ మీట్లలో ఆయన వ్యవహార శైలి దీన్ని రుజువు చేస్తోంది కూడా.

ఇక మిగిలింది ఏంటంటే.. పదవి నుంచి దిగిపోయిన తర్వాత నిమ్మగడ్డ రాజకీయాల్లోకి రావడమే. కచ్చితంగా ఆయన టీడీపీలోనే చేరతారనే అనుమానాలున్నాయి అందరికీ. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా.. నిమ్మగడ్డ రాజకీయ భవిష్యత్ ఏంటనేది అందరికీ తెలిసిందే. 

పత్రికలు హీరోని చేసినంత సులభంగా.. జనంలో హీరో కావడం కష్టం. అదే జరిగితే.. ఆవేశంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న జేడీ లక్ష్మీనారాయణ కనీసం సర్పంచ్ గా అయిన గెలిచేవారు కదా?

ఇప్పుడు నిమ్మగడ్డ కూడా స్వర్గానికి ఎగురుతానంటే కాదనేవారెవరు. కానీ ఆయన ముందుగా ఉట్టికి ఎగరాలి కదా? ఏదేమైనా రేపు నిమ్మగడ్డ.. అత్యుత్సాహంతో చేసే పని ఏదైనా దానికి కారణం మాత్రం పచ్చపాత మీడియానే. ఒకవేళ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-3 చేస్తానంటూ నిమ్మగడ్డ ఉత్సాహం చూపినా ఆ పాపం.. బాబు అనుకూల మీడియాది తప్ప ఇంకొకరిది కాదు. 

ఎందుకు పెదవి విప్పాలి?

జగన్ కు వచ్చిన నష్టం ఏమిటి?