అవకాశం కోసం ఎదురు చూసి మరీ ఎన్నికలకు వెళ్లాలనుకున్న నిమ్మగడ్డ ఎత్తుగడ ఫలించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ని అడ్డం పెట్టుకుని ఏపీలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న ఆయన కోరిక నెరవేరేలా కనిపించడం లేదు.
ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగాయని పొరుగు రాష్ట్రం తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తు చేస్తూ.. ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతున్నట్టు తెలిపిన నిమ్మగడ్డకు ప్రభుత్వం షాకిచ్చింది.
ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా లేదని సీఎస్ తేల్చి చెప్పడంతో ఇక గవర్నర్ పైనే పూర్తి భారం వేశారు నిమ్మగడ్డ. ఈ పాటికే గవర్నర్ కు లేఖ రాసిన నిమ్మగడ్డ.. ఆయనతో నేరుగా ఈరోజు భేటీ అవుతున్నారు. ఏపీలో ఎన్నికల నిర్వహించేలా చూడాలని, ప్రభుత్వానికి ఆమేరకు ఆదేశాలివ్వాలని కోరబోతున్నారు.
ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్దంగా ఉందని, కేసులు కూడా తగ్గుతున్నాయని, ఇతర రాష్ట్రాలను సైతం ఉదాహరణగా చూపించబోతున్నారు నిమ్మగడ్డ. అదే సమయంలో ఎన్నికలు పూర్తైతే.. స్థానికంగా కొత్తగా ఎన్నికయ్యే ప్రజా ప్రతినిధుల ద్వారా మరింత సమర్థంగా కొవిడ్ ని ఎదుర్కోవచ్చనే వితండ వాదన కూడా చేస్తున్నారు.
మొత్తమ్మీద తాను దిగిపోయేలోగా ఏపీలో స్థానిక పోరు పెట్టాలన్న ఆశతో ఉన్న నిమ్మగడ్డ.. జీహెచ్ఎంసీ షెడ్యూల్ విడుదలయ్యే వరకు అదను కోసం ఎదురు చూశారు. సరిగ్గా నోటిఫికేషన్ విడుదలయ్యాక, ఏపీలో స్థానిక ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు తనకి తానే డిసైడ్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో ముహూర్తం కూడా చూసుకున్నారు.
అయితే ఎన్నికల వాయిదా వేళ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చేసిన తప్పుని ఈసారి రిపీట్ చేయలేదు. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. సీఎస్ లేఖతో ప్రభుత్వ నిర్ణయం తేలిపోవడంతో.. ఇప్పుడు గవర్నర్ దగ్గర ఎన్నికల పంచాయితీ పెట్టబోతున్నారు.
హైకోర్టు సమన్వయంతో పనిచేసుకోండని.. ఇరు వర్గాలకు గతంలోనే స్పష్టం చేసిన నేపథ్యంలో.. మరోసారి గవర్నర్ ద్వారా తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు నిమ్మగడ్డ. కనీసం ఈ ఎత్తుగడ అయినా ఫలించాలని నిమ్మగడ్డ సహా టీడీపీ వర్గాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి.
అయితే నిమ్మగడ్డ తెలుసుకోవాల్సి విషయం ఏంటంటే.. ఈ మధ్యే గవర్నర్ ను కలిసిన ముఖ్యమంత్రి జగన్.. ఎన్నికలపై పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ, తనకు అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది.