నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షకు డేట్ ఫిక్స్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు చాన్నాళ్ల కిందటే ఆదేశాలు జారీచేసింది. అయితే వివిధ కారణాల వల్ల ఉరి శిక్షను అమలు చేయలేకపోయారు పోలీసులు. ఎట్టకేలకు…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు చాన్నాళ్ల కిందటే ఆదేశాలు జారీచేసింది. అయితే వివిధ కారణాల వల్ల ఉరి శిక్షను అమలు చేయలేకపోయారు పోలీసులు. ఎట్టకేలకు ఈ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారుచేశారు. ఈనెల 16న ఉదయం 5 గంటలకు తీహార్ జైలు అధికారులు ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.

దిశ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేళ, నిర్భయ ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఏడేళ్లయినా నిందితులకు ఉరిశిక్ష విధించకపోవడంపై, నిర్భయ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. సరిగ్గా ఇదే టైమ్ లో దోషులకు చెందిన క్షమాభిక్ష పిటిషన్ ను కూడా రాష్ట్రపతి తిరస్కరించడంతో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు తీహార్ జైలు అధికారులు.

ఈ కేసులో ఓ మైనర్ తో పాటు ఆరుగుర్ని దోషులుగా ప్రకటించింది కోర్టు. అయితే వీళ్లలో కీలక దోషి రామ్ సింగ్, విచారణ జరుగుతుండగానే జైళ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మైనర్ కు జువైనల్ కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అతడు విడుదలై కూడా మూడేళ్లు అవుతోంది. అయినప్పటికీ ఇంకా కీలక దోషులకు శిక్షలు అమలుచేయకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు ఉరిశిక్ష అమలుకు సంబంధించి బీహార్ లోని బక్సర్ జైలు అధికారులకు ఉరితాళ్లు తయారుచేయమని సందేశం అందింది. 10 ఉరితాళ్లు కావాలంటూ తమకు సందేశం అందినట్టు బక్సర్ జైలు అధికారులు వెల్లడించారు. ఉరితాళ్ల తయారీలో బక్సర్ జైలుకు 90 ఏళ్ల చరిత్ర ఉంది. అఫ్జల్ గురును ఉరితీయడానికి కూడా ఇక్కడ్నుంచే తాళ్లు తెప్పించారు. ఒక్కో తాడు తయారుచేయడానికి నాలుగు రోజులు పడుతుంది. పదేళ్ల కిందట ఈ తాడు ధర 1725 రూపాయలు.