అమెరికా…భూతల స్వర్గమని పేరు. అలాంటి అమెరికా అధ్యక్షుడి భార్యగా , వైట్‌హౌస్ మహరాణిగా…వావ్ ఎగిరి గంతేస్తారు కదూ. వైట్‌హౌస్ జీవితాన్ని ఊహించుకుంటూ…కలల్లో ఎక్కడెక్కిడికో వెళ్లిపోతారు కదూ! నిజమే, అన్నీ బాగుంటే అంతకంటే జీవితానికి కావాల్సింది ఏముంది?
స్లొవేనియాలో పుట్టి పెరిగిన మెలనియా, అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకునే ముందు అందరి ఆడపిల్లల్లానే వివాహ జీవితం గురించి ఎన్నో కలలు కనే ఉంటుంది. ఎందుకంటే ఆమెకు హృదయం ఉంది. తానెప్పుడూ వైట్‌హౌస్‌కు పట్టపురాణి అవుతానని ఊహించి ఉండరామె. అలాంటిది అమెరికా మొదటి విదేశీ మహిళగా రికార్డుకెక్కింది. కానీ ఆమె నివసిస్తున్న వైట్‌హౌస్‌లో పంజరంలో చిలుకలా బందీగా కాలం వెళ్లదీస్తోందనే చేదు నిజం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.
“ఫ్రీ మెలనియా-ది అనాథరైజ్డ్ బయోగ్రఫీ” పేరుతో సీఎన్ఎన్ జర్నలిస్టు కేట్ బెనెట్ అమెరికా మొదటి మహిళైన మెలనియా గురించి రాసిన పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ట్రంప్ మూడో భార్య మెలనియా. వారి ప్రేమకు చిహ్నంగా 13 ఏళ్ల కుమారుడు బారెన్ ఉన్నాడు. పేరుకే ట్రంప్, మెలనియా దంపతులు. భార్యభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమానుబంధాలు లేవనే వాస్తవాన్ని ఈ పుస్తకం వెలుగులోకి తెచ్చింది.
వైట్‌హౌస్‌లో ఆమెకు కొడుకే సర్వస్వం. కొడుకు కాకుండా మిగిలిన జీవితం పూర్తి ఒంటరిమయం. ఆమె ఒంటరికి మరో ఒంటరి తోడంతే. వైట్‌హౌస్‌లో ట్రంప్ రెండో అంతస్తులో, మెలనియా మూడో అంతస్తులో ఉంటారని ఆ పుస్తకం వెలుగులోకి తెచ్చింది. ట్రంప్ మొదటి భార్య ఇవాంక అన్నీ తానై వైట్‌హౌస్‌ను నడిపిస్తోంది. వైట్‌హౌస్‌లో తన ఉనికిపై ప్రశ్నేమెలనియాకు ట్రంప్‌తో, ఇవాంకతో విభేదాలు తెచ్చి పెట్టింది.
అమెరికా మొదటి మహిళగా మెలనియా పోషించాల్సిన పాత్రలో ట్రంప్ మొదటి భార్య కూతురు ఇవాంక చొరబడడంతోనే అసలు సమస్య తలెత్తింది. మెలనియా, ఇవాంక దాదాపు ఒకే వయస్సు వాళ్లు. ఎలాంటి మానసిక సంబంధాలు లేకుండా ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఎందుకు జీవనం సాగిస్తున్నారే ప్రశ్నకు…ఇప్పుడు తన ప్రాధాన్యతలు కుమారుడి భవిష్యత్తేనని ఆమె చెబుతారు.
వైట్‌హౌస్ పంజరంలో బందీగా ఉండేందుకు చిలుక కూడా అంగీకరించదు. అలాంటిది భూతల స్వర్గంగా పిలవబడే అమెరికా అధ్యక్షుడి భార్య పంజరంలో చిలుకలా జీవించడానికి ఇష్టపడరు. డబ్బు, హోదా, అధికార దర్పం…జీవితం అంటే ఇవి కావు. ఇవేవీ లేకపోయినా…ట్రంప్ ప్రేమకు బందీగా ఉండాలని ఆమె కల కని ఉంటుంది. కల్లలైన ఆ జీవితం నుంచి విముక్తి పొందడానికి బహుశా ఆమె కాలం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఆ జీవితాన్ని కూడా మరో పుస్తకంలో చదువుకునే రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉండొచ్చు.