దేశం దాటి పరార్ అయిన నిత్యానంద స్వామి సొంతంగా దేశాన్నే ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారట. కరేబియన్ దీవుల్లో నిత్యానంద సొంతంగా ఒక దీవిని కొనుగోలు చేసినట్టుగా ప్రకటించుకున్నారు.
ఈక్వెడార్ నుంచి ఒక దీవిని కొనుగోలు చేసి నిత్యానంద దాన్ని సొంత దేశంగా ప్రకటించుకున్నారు. దానికి 'కైలాస' అని పేరు పెట్టుకున్నారట, దాన్నొక హిందూరాజ్యంగా ప్రకటించుకున్నారాయన.
తన దేశానికి కేబినెట్ ను, ప్రధానమంత్రిని కూడా ప్రకటించారు నిత్యానంద. ఈ విషయాలన్నింటినీ చెబుతూ ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. తన దేశానికి గుర్తింపును ఇవ్వాలంటూ నిత్యానంద ఐక్యరాజ్య సమితిని కోరనున్నారట. అలాగే తన దేశంలో పౌరసత్వాలను కూడా ఇస్తారట నిత్యానంద. అందుకు గానూ కొంత విరాళాలు ఇవ్వాల్సి ఉంటుందట!
మొత్తానికి ఇండియా దాటిన నిత్యానంద తన ఉనికిని ఇలా చాటారు. అత్యాచారం తో సహా వివిధ రకాల అభియోగాలను ఎదుర్కొంటున్నారు ఈ స్వామీజీ. పదేళ్ల కిందటే నిత్యానంత వివాదాల పాలయ్యారు. ఒక నటీమణితో ఇతడు సన్నిహితంగా ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చి సంచలనం రేపాయి.
ఆ తర్వాత నిత్యానందపై అనేక అభియోగాలు వచ్చాయి. కొంతకాలం పాటు ఆయన జైల్లో ఉన్నారు. విడుదల అయ్యారు, కేసుల విచారణ సాగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో ఆయన దేశం దాటారు. బీజేపీ హయాంలో నేరారోపితులు పలువురు దేశం దాటారు. అలాంటి జాబితాలో నిత్యానంద కూడా నిలుస్తున్నారు.
ఇక తనను ఇండియా పట్టుకోవడానికి వీల్లేకుండా, ఏకంగా సొంతంగా దేశాన్నే ప్రకటించుకున్నారు నిత్యానంద. భక్తి సామ్రాజ్యం ద్వారా నిత్యానంద కొన్ని కోట్ల రూపాయలను కూడబెట్టారనేది ముందు నుంచి ఉన్న ప్రచారమే. ఇలాంటి క్రమంలో ఆ డబ్బును ఉపయోగించుకుని ఏకంగా ద్వీపాన్నే కొనుగోలు చేసినట్టుగా ఉన్నారు.
వేరే దేశంలో ఆశ్రయం తీసుకుంటే దౌత్య పరమైన ఒత్తిళ్లు ఉంటాయి, ఆ అవకాశం లేకుండా సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద దేశాన్ని దాటాలనుకునే నేరగాళ్లకు కొత్త స్ఫూర్తిని ఇచ్చినట్టుగా ఉన్నాడు!