ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన అత్యుత్తమ కార్యక్రమాల్లో రివర్స్ టెండరింగ్ ఒకటి. ఇప్పటికే ఈ పద్ధతిలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేస్తున్న ముఖ్యమంత్రి, తాజాగా ఇదే పద్ధతి అనుసరించి మరో విజయ సాధించారు. రివర్స్ టెండరింగ్ లో ఏపీ ఖజానాకు తాజాగా 83 కోట్ల రూపాయలు ఆదా అయింది.
గ్రామ వాలంటీర్ల కోసం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. ఈ మేరకు టెండర్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. 2లక్షల 64వేల 920 సెల్ ఫోన్ కొనుగోళ్లకు టెండర్ ఆహ్వానించగా, ఓ సంస్థ 317 కోట్ల 61 లక్షల రూపాయలకు టెండర్ వేసింది. దీనిపై ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ఇందులో 231.81 కోట్ల రూపాయలకే టెండర్ ఖరారైంది.
అలా 26.4 శాతం తక్కువకే టెండర్ నమోదవ్వడంతో పాటు.. ఖజానాకు 83 కోట్ల 80 లక్షల రూపాయలు మిగిలాయి. ప్రతి మొబైల్ ఫోన్ లో ఏడాది వారెంటీతో పాటు.. 3జీబీ ర్యాబ్, 32 జీబీ మెమొరీ, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండాలని నిబందన విధించింది ప్రభుత్వం. ఈ నిబంధనలు పాటించడంతో పాటు.. మూడేళ్లు సర్వీసింగ్ ఉచితంగా అందిస్తామని, టాంపర్డ్ గ్రాస్, బ్యాక్ కవర్ కూడా ఉచితంగా ఇస్తామనే హామీతో ఓ సంస్థ ముందుకొచ్చింది. అది కూడా రివర్స్ టెండరింగ్ లో.
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ పద్ధతి పూర్తిగా సక్సెస్ అయింది. దీంతో అన్ని ప్రభుత్వ కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ ను ఫాలో అవుతోంది జగన్ సర్కార్. అలా ఖజానాకు వందల కోట్ల రూపాయలు మిగులుతోంది.