నిమ్మ‌గ‌డ్డ తీరు.. ప్రాథ‌మిక ప్ర‌శ్న‌ల‌కే స‌మాధానాలు దొర‌క‌వంతే!

ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికీ, ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌నర్ నిమ్మ‌గడ్డ ర‌మేష్ కుమార్ కు మ‌ధ్య‌న సాగుతున్న అమీతుమీ పోరాటం అనే కోణాన్ని కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. నిమ్మ‌గ‌డ్డ హ‌యాంలో స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏపీ…

ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికీ, ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌నర్ నిమ్మ‌గడ్డ ర‌మేష్ కుమార్ కు మ‌ధ్య‌న సాగుతున్న అమీతుమీ పోరాటం అనే కోణాన్ని కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. నిమ్మ‌గ‌డ్డ హ‌యాంలో స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం ఏ మాత్రం సానుకూలంగా లేద‌నేది బ‌హిరంగ స‌త్యం.

ఎలాగూ త‌న ప‌ద‌వీ కాలం అతి త్వ‌ర‌లో ముగియ‌నున్న నేప‌థ్యంలో ఆ లోపే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నేది నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆలోచ‌న కావొచ్చ‌నేది సామాన్యుల అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే వాద‌న చేస్తూ ఉంది. ఈ వాద‌న‌లు, అభిప్రాయాలు.. వీట‌న్నింటినీ కాసేపు ప‌క్క‌న పెడితే, ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స‌మాధానాలు ఇవ్వాల్సిన ప్ర‌శ్న‌లు కొన్ని మిగిలే ఉన్నాయి. వాటికి రాజ‌కీయ నిమిత్తం లేదు. అవేమిటంటే..

అప్పుడే ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హించ‌లేదు? ఈ ప్ర‌శ్న‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ నిమ్మ‌గ‌డ్డ స‌మాధానం ఇవ్వ‌లేదు. వాస్త‌వానికి ఏపీలో స్థానిక సంస్థ‌ల అధికార కాలాలు పూర్తై సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి.

ఎప్పుడో ఉమ్మ‌డి ఏపీలో, కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఏపీలో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఐదేళ్ల ప‌ద‌వీ కాలం పూర్తై మ‌రో మూడేళ్ల వ‌ర‌కూ గ‌డిచిపోయాయి. ఏడాది కింద‌ట స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌క్రియ మొద‌లైంది. అంటే.. అంత‌కు ముందు క‌నీసం నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే విష‌యం గుర్తుకు రాలేదా?

అప్పటి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌లేదు. అప్పుడు ఎన్నిక‌ల నిర్వ‌హించ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థకు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిన‌ట్టే! విచిత్రం ఏమిటంటే.. అప్పుడు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎవ్వ‌రికీ శ్ర‌ద్ధ లేదు, ఎవ్వ‌రికీ ఆ ఆలోచ‌న లేదు! ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డం జ‌రిగే న‌ష్టాల గురించి మాట్లాడుతున్న వాళ్లు.. అప్పుడు ఎందుకు నోరు తెర‌వ‌లేదు? అనేది శేష‌ప్ర‌శ్న‌!

ఇక రెండో అంశం.. ప్రెస్ మీట్ సంద‌ర్భంగా నిమ్మ‌గ‌డ్డ తీసుకున్న జాగ్ర‌త్త‌లు. రెండు గ్లాస్ షీల్డ్ ల‌ను అడ్డు పెట్టుకుని మ‌రీ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. అది అభినందించాల్సిన అంశం. క‌రోనా వైర‌స్ కు భ‌య‌ప‌డి అలా రెండు షీల్డులు పెట్టుకుని మ‌రీ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అక్క‌డ‌కు హాజ‌రైన విలేక‌రుల సంఖ్య కూడా ప‌రిమిత సంఖ్య‌లోనే ఉన్నా ఇన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకున్నారు. అది మంచిదే!

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఆయ‌న ఒక్క‌రూ తీసుకుంటే స‌రిపోతుందా?  రేపు పోలింగ్ బూత్ ల‌లో విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ప‌రిస్థితి ఏమిటి? ఎన్నిక‌ల ప్ర‌చారం అంటూ.. కొన్ని వంద‌ల మంది రోడ్ల మీద ప‌డితే.. వారితో ఏ మాత్రం సంబంధం లేని సామాన్యుల ప‌రిస్థితి ఏమిటి?  రోడ్డు మీద తిరిగే వారికే క‌రోనా సోకాల‌ని ఏమీ లేదు.

రాజ‌కీయ పార్టీల వాళ్లు ర‌చ్చ ర‌చ్చ చేస్తే.. వాళ్ల‌తో ఏ మాత్రం సంబంధం లేద‌ని వాళ్లు కూడా క‌రోనా బారిన ప‌డే అవ‌కాశాలున్నాయి. ఆల్రెడీ కేర‌ళ ఉదాహ‌ర‌ణ ఈ విష‌యంలో ఉండ‌నే ఉంది. త‌న వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి అంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్.. ఉద్యోగుల భ‌ద్ర‌త గురించి ఏం చెబుతారు? ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌తో క‌రోనా మ‌ళ్లీ ఎక్కువ‌గా వ్యాప్తి చెందితే.. అప్పుడు బాధితులు అయ్యే వారికి ఇప్పుడు ఏమ‌ని స‌మాధానం ఇస్తారు? ఈ ప్ర‌శ్న‌లకు మాత్రం సామాన్యుల‌కు స‌మాధానాలు దొర‌క‌డం లేదు. 

ఏపీలో ఈ ప‌రిస్ధితి అవాంఛ‌నీయ‌మైన‌ది!

మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..!