ఫోర్జరీ డాక్యుమెంట్లతో బస్సులను, లారీలను అమ్మిన జేసీ ట్రావెల్స్ వ్యవహారానికి సంబంధించి అరెస్టు అయిన తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి ల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. కేవలం బెయిల్ ను తిరస్కరించడమే కాకుండా వారిపై నమోదైన అభియోగాలపై కోర్టు చీవాట్లు పెట్టినట్టుగా సమాచారం. సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా చూపి రిజిస్ట్రేషన్లను చేయించిన వారి పట్ల కోర్టు తీవ్ర వ్యాఖ్యానాలు చేసినట్టుగా సమాచారం.
నిషేధిత వాహనాలను అమ్మి, ప్రమాదాలకు కారణం అయితే ఎవరిది బాధ్యత? అని వారిని కోర్టు ప్రశ్నించినట్టుగా సమాచారం. ఏకంగా 154 బస్సులను, లారీలను వీళ్లు తప్పుడు డాక్యుమెంట్లతో అమ్మారని అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం మూడు కేసులు నమోదైనట్టుగా సమాచారం. వాటిల్లో ఒక్కో దాంట్లోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లు బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరికి బెయిల్ నిరాకరిస్తూ, దిగువ కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని హై కోర్టు పేర్కొందని సమాచారం.
దిగువ కోర్టులు ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ ల బెయిల్ కు నిరాకరించాయి. తాము చేసిన తప్పులకు మహా అంటే ఫైన్ పడుతుందని ఒక ఇంటర్వ్యూలో ప్రభాకర్ రెడ్డి దర్జాగా వ్యాఖ్యానించారు. తాము చేసిన తప్పును కూడా అలా సమర్థించుకునే ప్రయత్నం స్వయంగా నిందితుడే చేయడం గమనార్హం! ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లు కడప జైల్లో ఉన్నారు. విచారణ అనంతపురంతో సహా కర్నూలులో కూడా సాగుతూ ఉంది.