త్వరలో జగన్ కొత్త కేబినెట్ మన ముందుకు రానుంది. ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరిని మినహాయించి మిగిలిన వారందరినీ తప్పించినున్నట్టు ఇటీవల స్వయంగా జగనే చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఒకరిద్దరు మంత్రులెవరు? అలాగే కొత్త మంత్రులెవరనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ పరంపరలో సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలను తప్పకుండా కొనసాగిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది.
అయితే వాళ్లిద్దరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కొనసాగించే వాతావరణం లేదు. వాళ్లద్దిరినీ పిలిచి …మంత్రులుగా తప్పిస్తున్నానని, పార్టీ బాధ్యతలను తీసుకుని, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని జగన్ విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇందుకు వారు కూడా సమ్మతించినట్టు తెలిసింది.
దీంతో సీనియర్ మంత్రులు కావడం వల్ల, బొత్స, పెద్దిరెడ్డిలను కొనసాగిస్తారనే ప్రచారానికి త్వరలో జగన్ ఫుల్‌స్టాప్ పెట్టనున్నారని అర్థం చేసుకోవచ్చు. పార్టీని బలోపేతం చేసేందుకు సీనియర్ నేతల సహకారం తీసుకునేందుకే, బొత్స, పెద్దిరెడ్డిలకు క్రియాశీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలిసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానంగా మరోసారి అధికారంలోకి రావడంపైన్నే దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్టీని బలోపేతం చేయాలంటే పెద్దిరెడ్డి, బొత్స లాంటి వాళ్ల సహకారం ఎంతో అవసరమని భావిస్తున్నారనేందుకు, వారికి వైసీపీ బాధ్యతల్ని అప్పగించాలని నిర్ణయించుకోవడమే నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు.