'ఒక రైతు చనిపోతే పరవశించడానికి వెళ్తున్నా..' అంటూ ఇటీవలే వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు. తెలుగు పలకడంలో.. మాట్లాడటంలో తన పాండిత్యాన్ని మరోసారి ప్రదర్శించారు ఆయన. నారా లోకేష్ కొంత విరామం తర్వాత జనాల ముందుకు వస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేష్ తనదైన వినోదాన్ని పండించారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాకా లోకేష్ రాజకీయాలు ట్విటర్ కే పరిమితం అయ్యాయి. ట్విటర్ లో చెలరేగిపోతూ.. జనాలకు చేరువ కాలేకపోతున్నారు నారా లోకేష్. ఆ సంగతలా ఉంటే.. ఇక తెలుగుదేశం పార్టీకి అమరావతి రూపంలో కఠిన పరీక్ష ఎదురవుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నానా కష్టాలు పడుతున్నారు. 'తను ఐదేళ్లో పదేళ్లో..' ఉంటా అంటూ.. చంద్రబాబు నాయుడు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక పగ్గాలు అందుకోవాల్సిన లోకేష్ బాబు మాత్రం ప్రహసనం పాలవుతూనే ఉన్నారు.
అమరావతి ఆందోళనల్లో భాగంగా నారా లోకేష్ యథారీతిన నోరు జారుతూ ఉన్నారు. దాడి విషయంలో తమ వారిపై కేసులు పెట్టడంపై లోకేష్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అదెలాగంటే.. 'మేం దాడి చేస్తే.. మా మీద కేసులు పెడతారా..' అంటూ లోకేష్ ప్రశ్నించేశారు! వెనుకటికి కులపిచ్చి, మత పిచ్చి, బంధుప్రీతి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే అని తేల్చిన నారా లోకేష్. తాము దాడి చేసినందుకే తమ మీద కేసులు పెట్టారని.. తాజాగా సెలవిచ్చారు. లోకేష్ ఏం మారలేదంతే.. జేసీ దివాకర్ రెడ్డి అన్నట్టుగా లోకేష్ మాట్లాడితే నవ్వుకోవాలంతే!