విశాఖకు రాజధాని.. ఓ ఆపద, భారీ కుట్ర…!?

శుభమా అని రాజధాని విశాఖకు ప్రతిపాదిస్తే ఆహ్వానించాల్సిన రాజకీయ జీవులు అదేదో మహా భూతమైనట్లుగా జనాలను భయపెట్టేస్తున్నారు. బాబోయ్.. రాజధాని వద్దోయ్ అంటూ తమ సొంత కక్షలను జనాలకు తగిలిస్తున్నారు. నిజానికి ఏ ప్రాంతం…

శుభమా అని రాజధాని విశాఖకు ప్రతిపాదిస్తే ఆహ్వానించాల్సిన రాజకీయ జీవులు అదేదో మహా భూతమైనట్లుగా జనాలను భయపెట్టేస్తున్నారు. బాబోయ్.. రాజధాని వద్దోయ్ అంటూ తమ సొంత కక్షలను జనాలకు తగిలిస్తున్నారు. నిజానికి ఏ ప్రాంతం అభివ్రుధ్ధి చెందాలన్నా దానికి ఒక దర్జా దర్పం కావాలి. రాజధాని హోదా విశాఖకు ఇస్తామంటే వద్దనే వారు రెండు రకాలు అయి ఉండాలి. వారు పక్కా స్వార్ధపరులైనా అయి ఉండాలి. లేకపోతే మూర్ఖులైనా అయి ఉండాలి.

చూడబోతే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని రెండవ క్యాటగిరీలో చేర్చడం కష్టం. ఆయన ఆరు సార్లు ఎమెల్యే, మూడు సార్లు మంత్రి అయిన ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. మరి విశాఖ రాజధాని అంటే అయ్యన్నకు ఎందుకు నొప్పి అంటే ఆయన బాబు గూటి పక్షి. ఆయన మాట, ఆయన పాటే పాడాలి కాబట్టి అలా అంటున్నారనుకోవాలి.

విశాఖకు రాజధాని వస్తే ఆపద ముంచుకువచ్చినట్లేనని అయ్యన్న చిలక జోస్యాలు చెబుతున్నారు. ఆ ఆపద ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది మాత్రం ఆయన చెప్పడంలేదు. బహుశా ఆయన‌కే అదేంటో తెలియదు కాబోలు. బాబు సీఎంగా ఉండగా ఆయనకు భజన చేస్తూ అయిదేళ్ళ పాటు మంత్రి పదవులు అనుభవించిన అయ్యన్న నాడు కనీసం విశాఖను రాజధాని చేయండని  ప్రతిపాదించలేకపోయారు.

ఇపుడు జగన్ విశాఖ రాజధాని అని ప్రతిపాదిస్తే మాత్రం అదో పెద్ద తప్పుగా, ఉత్తరాంధ్రకు ముప్పుగా చిత్రీకరించడమే దారుణం. అంటే తామే రాజులుగా ఉండాలి, ఈ ప్రాంతం మాత్రం రాజధాని కాకూడదన్న స్వార్ధ చింతక తప్ప ఇందులో మరోటి లేదని వైసీపీ నేతలు అంటున్నారు.

అయ్యన్నను ఉత్తరాంధ్ర ద్రోహిగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్రాకు మంత్రి హోదాలో మేలు చేయకపోగా ఇపుడు ఓడిపోయినా కూడా పుల్లలు పెట్టడమేంటని గుస్సా అవుతున్నారు. అయ్యన్న తీరు మార్చుకోవాలని, స్థానికుడిగా మద్దతు ఇచ్చి రాజధానిని స్వాగతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు విశాఖ రాజధాని ప్రకటన వెనక భారీ కుట్ర దాగిఉందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటున్నారు. ఆ కుట్ర ఏంటో కేంద్రంలో ఆయన పార్టీ ఉంది కదా, వెలికి తీస్తే బాగుంటుందని వైసీపీ నేతలు సలహా ఇస్తున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ రేసులో ఉన్న మాధవ్ మొదట విశాఖ రాజధాని ప్రకటనకు స్వాగతించి ఇపుడు నాలుక మడతేస్తున్నారని విమర్శిస్తున్నారు. పదవులు తప్ప ప్రాంతాల బాగు అక్కరలేని నేతలు ఉండడం వల్లనే ఉత్తరాంధ్ర  ఇన్నాళ్ళుగా వెనకబడిపోయిందని వైసీపీ నేతలు ఘాటుగానే తగులుకుంటున్నారు.