ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్లు తలోమాటా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరితో మరొకరి ప్రకటనలకు సంబంధం ఉండకపోవడం గమనార్హం. ముందుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజధాని ప్రకటనను స్వాగతించారు. రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోలేదంటూ.. కమలం పార్టీ సీనియర్ నేతగా ఆయన ప్రకటించారు. వికేంద్రీకరణకు తమ మద్దతు అని, రాయలసీమలో హై కోర్టుకు పూర్తి మద్దతు అని ఆయన ప్రకటించారు.
ఇక ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. అందుకు భిన్నంగా స్పందించారు. రాజధాని రైతులకు తమ మద్దతు అని ఆయన ప్రకటించారు. జగన్ పాలన బాగోలేదన్నారు. ఆయనకు తోచినది ఆయన చెప్పారు. మూడు రాజధానుల అంశాన్ని కన్నా గట్టిగా సమర్థించలేదు. అలా జీవీఎల్ తో పూర్తి భిన్నమైన స్పందన వ్యక్తం చేశారు, వ్యక్తం చేస్తున్నారు కన్నా లక్ష్మినారాయణ.
మరోవైపు టీజీ వెంకటేష్ ది ఇంకో స్పందన. ఆయన మూడు రాజధానుల ప్రకటనను పూర్తిగా సమర్థించారు. కర్నూలులో హై కోర్టును ఆయన బలపరిచారు. అంతే కాదు.. కర్నూలులో మినీ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మినారాయణ, టీజీ వెంకటేష్.. వీళ్లంతా భారతీయ జనతా పార్టీ నేతలే కదా? అవతల తెలుగుదేశం వాళ్లు తామేం చేయలేక మోడీకి చెబుతాం, బీజేపీకి చెబుతాం.. అంటున్నారు. బీజేపీ వాళ్లేమో ఒకరు చెప్పినట్టుగా మరొకరు చెప్పడం లేదు. కమలం పార్టీ ముందుగా క్లారిటీ తెచ్చుకుంటే వాళ్లకే మేలేమో!