మహారాష్ట్ర రాజకీయంలో ఈ ఏడాది బాగా వినిపించిన పేరు అజిత్ పవార్. గతంలో కూడా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా వ్యవహరించినా రాని గుర్తింపు తను ఎన్సీపీకి చేసిన స్వల్పకాలపు తిరుగుబాటుతో సంపాదించుకున్నారు అజిత్ పవార్. ఎన్సీపీ నుంచి రాత్రికి రాత్రి ఫిరాయించి బీజేపీ వైపు చేరారు అజిత్. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.
అలా సొంత గూటికి చేరిన అజిత్ పవార్ మొత్తం శరద్ పవార్ అదుపాజ్ఞల్లోనే నడుచుకున్నారు అనేది ఒక అభిప్రాయం. తిరుగుబాటు, వెనక్కురావడం.. ఇవన్నీ కూడా శరద్ పవార్ స్ట్రాటజీ ప్రకారమే అంటారు. మరి అదే నిజం లాగుంది. ఇప్పుడు మళ్లీ అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్, శివసేన,ఎన్సీపీ ప్రభుత్వంలో అజిత్ కు డిప్యూటీ సీఎం పదవి లభించనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో…శరద్ పవార్ కు అజిత్ పై ఎలాంటి కోపం లేదనే విషయం తేలిపోనుంది.
ఉద్ధవ్ ఠాక్రే ఇంత వరకూ కేబినెట్ ను ఏర్పాటు చేసుకోలేదు. కాంగ్రెస్, ఎన్సీపీ, సేనల మధ్యన పదవుల డీల్ కుదిరిందట కానీ.. ఇంకా కేబినెట్ పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. అందుకు ఈ నెల ముప్పై ని ముహూర్తంగా అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దక్కనుందని, ఆయన మరోసారి ఆ పదవికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అజిత్ పవార్ కు మళ్లీ అంత ప్రాధాన్యత ఇస్తే.. ఆయన బీజేపీ వైపుకు వెళ్లి రావడం పూర్తిగా శరద్ పవార్ స్ట్రాటజీనే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.