రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొంచెం తేడాగా మాట్లాడితే ….వెంటనే హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రికి ఎత్తాల్సిందేనని సరదాగా అంటుంటారు. సాధారణ ప్రజలు తల తిక్క మాటలు మాట్లాడితే చుట్టు పక్కల వాళ్లకు మాత్రమే ప్రమాదం. అదే ఓ మంత్రిగా పని చేసిన నాయకుడు మాట్లాడితే… అది పార్టీకి, సమాజానికి కూడా చాలా నష్టం కలిగిస్తుందనడంలో భిన్నాభిప్రాయం ఉండదు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మాటల్లో ఏదో తేడా కొడుతోంది. దీంతో ఆయన ఎర్రగడ్డ కేసే అని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 4,5 విడతల రుణమాఫీ సొమ్ము ఎగ్గొట్టి రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. కావున స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తమకు ఓటెయ్యాలో చెప్పాలని వైసీపీని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ మ్యానిఫెస్టోలో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని కూడా విడిపిస్తామని నమ్మబలికి రైతుల ఓట్లు గంపగుత్తగా వేయించుకున్న విషయాన్ని కళా వెంకట్రావు మరిచిపోయినట్టున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం, కేవలం మూడు విడతల సొమ్ము మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తకుండా రైతులను నిలువునా మోసం చేసింది. నమ్మించి నట్టేట ముంచిన టీడీపీ ప్రభుత్వానికి ఘోర పరాజయానికి రైతుల రుణమాఫీ చేయకపోవడం కూడా ఒక కారణం.
వాస్తవాలు ఇవైతే, కళా వెంకట్రావు మాత్రం 4,5 విడతల రుణమాఫీ చేయలేదని జగన్ సర్కార్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తామిచ్చిన హామీని ప్రత్యర్థి పార్టీ నెరవేర్చలేదని, కావున ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించడమంటే …మానసిక స్థితిపై తప్పక అనుమాన పడాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కళా వెంకట్రావును వెంటనే హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు తరలించాలని సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి.