ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. హైకోర్టులో నిమ్మగడ్డకు వరుస ఎదురు దెబ్బలు తినాల్సి వస్తోంది. రెండు రోజుల క్రితం ఈ-వాచ్ యాప్‌నకు సంబంధించి హైకోర్టు ఈ నెల 9వ తేదీ వరకు స్టే విధించింది. దీంతో నిమ్మగడ్డకు న్యాయస్థానంలో మొదటి ప్రతికూల తీర్పు వచ్చినట్టైంది.
తాజాగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకూ గృహ నిర్బంధం చేయడంతో పాటు ఆయన్ను మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేయాలని డీజీపీని ఎస్ఈసీ నిన్న ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఎస్ఈసీ ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు ఆదివారం విచారణ చేపట్టింది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. మంత్రికి ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వివరాలు తీసుకోకుండా ఇంటికే పరిమితం చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రపతి తిరుమలకు వస్తున్నారని, ప్రొటోకాల్‌ను అనుసరించి ఆహ్వానించాల్సిన బాధ్యత మంత్రిపై ఉందని పిటిషన్ తరపు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు.
ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని తీర్పులో స్పష్టం చేసింది.
మంత్రిపై ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే సందర్భంలో మంత్రి మీడియాతో మాట్లాడొద్దన్న ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.మొత్తానికి నిమ్మగడ్డ విపరీత పోకడలకు హైకోర్టు బ్రేక్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.