చిరంజీవి-దర్శకుడు బాబి కాంబినేషన్ లో ఓ సినిమా ఎప్పట్నుంచో నలుగుతోంది. బాబి పేరును స్వయంగా చిరంజీవి ప్రకటించారు కూడా. కానీ సినిమా కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది మాత్రం మొన్నటివరకు ఓ అనుమానంగా ఉండేది.
ఎందుకంటే, కథ సెట్ అవ్వకపోతే ఎలాంటి దర్శకుడినైనా చిరంజీవి పక్కనపెట్టేస్తారు. దీనికితోడు అధికారిక ప్రకటన కూడా రాకపోవడంతో చిరు-బాబి సినిమాపై అనుమానాలు అలానే కొనసాగాయి.
ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడింది. తాజాగా జరిగిన స్టోరీ సిట్టింగ్ లో బాబి చెప్పిన పూర్తి నిడివి స్క్రీన్ ప్లేకు చిరంజీవి ఓకే చెప్పారు. సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా చిరంజీవి-బాబి సినిమాకు లైన్ క్లియర్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ భారీ బడ్జెట్ సినిమా.
ఇంతకీ ఈ కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా కోసం బాబి రాసుకున్న పంచ్ డైలాగ్స్, కామెడీ ఎపిసోడ్స్ చిరంజీవికి బాగా నచ్చాయట. ఖైదీ నంబర్ 150 తర్వాత మళ్లీ కామెడీ ట్రై చేయలేదు చిరంజీవి. పైగా క్యారెక్టర్ కొత్తగా ఉండడంతో చిరు సై అన్నారు.
ప్రస్తుతం ఆచార్య సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు చిరంజీవి. త్వరలోనే లూసిఫర్ రీమేక్ మొదలవుతుంది. అది కూడా పూర్తయిన తర్వాత బాబి సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మెహర్ రమేష్ సినిమా మరింత ఆలస్యం కాబోతోంది.